calender_icon.png 23 August, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌరవెల్లి కాల్వలకు రూ.25 కోట్లు వచ్చినయ్

23-08-2025 12:31:27 AM

  1. వాటితో హనుమకొండ జిల్లా పరిధిలో పనులు పూర్తి చేస్తం
  2. సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలకు త్వరలోనే నిధులు వస్తయ్
  3. భూ సేకరణకు రైతులు సహరించాలె
  4. గత సర్కార్ నిర్వాకంతో ఎన్జీటీ రూ.10కోట్లు ఫైన్ వేసింది
  5. వాటిని మేమే కట్టినం మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, ఆగస్టు 22 : గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల పనుల కోసం హనుమకొండ జిల్లాకు రూ.25 కోట్లు మంజూరయ్యాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్వరలోనే సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలకు కూడా నిధులు వస్తాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ’పనుల జాతర’ కార్యక్రమంలో భాగంగా ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో 46 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఇందులో కొత్త గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, బీటీ రోడ్ల నిర్మాణాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు ఈ ప్రాంతానికి గుండెకాయ లాంటిదన్నారు. ప్రాజెక్టు పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రస్తుతం భూసేకరణ, కాలువల నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పారు. కాలువల భూసేకరణ పనులకు రైతులు సహకరించి, నష్టపరిహారం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వం భూసేకరణలో సరిగా వ్యవహరించకపోవడం వల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.10 కోట్ల జరిమానా విధించిందని, ఆ మొత్తాన్ని తమ ప్రభుత్వమే చెల్లించిందని వెల్లడించారు. ఈ సమస్యను అధిగమించి, భూసేకరణ పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అక్కన్నపేటలో  ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆందోళన వ్యక్తం చేశారు.

విత్తనాలు, విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ, ఎరువుల సరఫరా కేంద్రం చేతిలో ఉందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రంతో మాట్లాడారని, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. రైతులు భయపడాల్సిన అవసరం లేదని, ఎరువులు ఇప్పించే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హైమవతి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.