ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!
పాఠశాల పరిసరాల్లో పబ్లిక్ న్యూసెన్స్.. స్థానికుల ఆగ్రహం
మల్దకల్, జూలై 11: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) మల్దకల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ గోడ పక్కనే తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన చేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానికుల కథనం ప్రకారం, తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకటేష్ పాఠశాల కాంపౌండ్ గోడ పక్కనే బహిరంగంగా మలవిసర్జన చేస్తూ కనిపించాడని తెలిపారు.
చిన్నారులు చదువుకునే విద్యాలయం పరిసరాల్లోనే ఈ ఘటన జరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు స్వచ్ఛ భారత్, పారిశుద్ధ్య కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేస్తూ బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు చర్యలు తీసుకుంటుండగా, ప్రభుత్వ ఉద్యోగి ఇలాంటి చర్యకు పాల్పడటం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. పాఠశాల పరిసరాలను అపరిశుభ్రం చేయడమే కాకుండా విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు కలిగించే విధంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారించి, ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






