మార్కెట్ అతలాకుతలం

10-05-2024 01:46:01 AM

1,000 పాయింట్లుపైగా పడిపోయిన సెన్సెక్స్

22,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ

వరుసగా ఐదో రోజూ అమ్మకాల వెల్లువ

నెలల కనిష్ఠానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ, అంబానీల ఫ్లాగ్‌షిప్ కంపెనీలు

ముంబై, మే 9: దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఎన్నికల జ్వరం పట్టుకుంది. లోక్‌సభ ఫలితాల పట్ల ఆందోళన, విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా జరుపుతున్న విక్రయాలతో బెంబేలెత్తిన బుల్స్ బ్లూచిప్ షేర్లను సైతం వదిలించుకుంటున్నారు. గత నాలుగు   రోజులుగా ఒడిదుడుకులతో ఇన్వెస్టర్లకు అల్లాడిస్తున్న మార్కెట్ వరుసగా ఐదో రోజైన గురువారం నిలువునా పతనమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,062 పాయింట్లు క్షీణించి 72,404 పాయింట్ల వద్దకు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 22,000 పాయింట్ల స్థాయిని వదులుకుంది. 345 పాయింట్లు పడిపోయిన ఈ సూచి  21,957 పాయింట్ల వద్ద నిలిచింది. అమ్మకాల తీవ్రతకు బ్లూచిప్ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ముకేశ్ అంబానీ ఫ్లాగ్‌షిప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, గౌతమ్ అదానీ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లు నెలల కనిష్ఠానికి దిగజారాయి.

చిన్న షేర్లు విలవిల

మార్కెట్లో  చిన్న షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయి. ప్రధాన సూచీ సెన్సెక్స్ చవిచూసిన 1.5 శాతం నష్టంకంటే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌ల పతనం తీవ్రంగా ఉన్నది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 2.41 శాతం నష్టపోగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.01 శాతం తగ్గింది. వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 3.41  శాతం క్షీణించింది. 

క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 3.37 శాతం, మెటల్ ఇండెక్స్ 3.13 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 2.92 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 2.59 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 2.39 శాతం చొప్పున తగ్గాయి. ఆటోమొబైల్ ఇండెక్స్ లాభపడింది.  

ఎల్ అండ్ టీ టాప్ లూజర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా లార్సన్ అండ్ టుబ్రో 5 శాతంపైగా పతనమై రూ.3,200 దిగువన ముగిసింది. ఈ కంపెనీ వెల్లడించిన క్యూ4 ఫలితాలు నిరుత్సాహపర్చడంతో ఇన్వెస్టర్లు విక్రయించారు.  ఇదేరీతిలో అంచనాలకు దిగువ స్థాయిలో ఫలితాలు ప్రకటించిన ఏషియన్ పెయింట్స్ 4 శాతంపైగా పడిపోయింది. జెఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్,  అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనీలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ,  బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్‌లు 1 శాతం మధ్య తగ్గాయి. మార్కెట్ సమయంలో ఫలితాలు ప్రకటించిన ఎస్బీఐ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి రూ.839 వద్దకు పెరిగినప్పటికీ, ముగింపులో అధికశాతం లాభాల్ని కోల్పోయి రూ.820 వద్ద నిలిచింది. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్‌లు 1.5 శాతం వరకూ పెరిగాయి.  

ఎఫ్‌పీఐల అమ్మకాలు మరో రూ.7 వేల కోట్లు

కొద్ది రోజుల నుంచి అదేపనిగా నిధుల్ని మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) గురువారం పెద్ద ఎత్తున విక్రయాలు జరిపారు. తాజాగా మార్కెట్లో వీరు రూ. 6,995 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు  స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి రూ. 14,000 కోట్లకుపైగా వెనక్కు తీసుకున్నారు. 

కరిగిపోయిన రూ.7 లక్షల కోట్లు ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో తొలి దశల్లో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గడంతో మార్కెట్లో తలెత్తిన వూహాగానాల ఫలితంగా స్టాక్ సూచీల పతనం గురువారం తీవ్రతరమయ్యింది. దీంతో ఈ ఒక్కరోజులనే రూ.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.7,34,513 కోట్ల మేర తగ్గి రూ.3,93,34,896 కోట్లకు (4.71 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది. మే 2న బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి రూ.4,08,49,768 కోట్లకు చేరింది. ఎన్నికల సీజన్ వేడెక్కడంతో ఇన్వెస్టర్లు వేగంగా వారి ఈక్విటీ పెట్టుబడులను తగ్గించుకుంటున్నారని, మిడ్, స్మాల్ క్యాప్‌ల్లో జరుగుతున్న భారీ అమ్మకాలే ఇందుకు నిదర్శనమని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు.

88 శాతం పెరిగిన వీఐఎక్స్

అమెరికా మార్కెట్లు పటిష్ఠంగా ట్రేడవుతున్నా,   దేశంలో ఇన్వెస్టర్లు మాత్రం భయాలు చుట్టుముట్టడంతో అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఇన్వెస్టర్ల భయాలను సూచించే ఎన్‌ఎస్‌ఈ వొలటాలిటీ ఇండెక్స్ (వీఐఎక్స్) వరుసగా 11 రోజులూ పెరిగి 18.20 వద్దకు చేరింది. ఇన్ని రోజులు వీఐఎక్స్ పెరగడం ఇదే ప్రధమమని విశ్లేషకులు తెలిపారు.  ఏప్రిల్ కనిష్ఠం నుంచి ఇది 88 శాతం పెరిగింది. ఈ ఇండెక్స్ పెరిగితే రిస్క్ తీసుకోవడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నట్టు సంకేతంకాగా, వీఐఎక్స్ దిగువస్థాయిలో ఉంటే మార్కెట్ రిస్క్‌కు మదుపుదారులు సంసిద్ధంగా ఉన్నట్టు పరిగణించవచ్చు. వాస్తవానికి ఎన్నికల సందర్భంగా వీఐఎక్స్ పెరగడం సాధారణమే. అయితే 2019 ఎన్నికల సందర్భంగా ఈ సూచి 20 శాతమే పెరిగింది. ఈ దఫా నరేంద్ర మోది నేతృత్వంలోని ఎన్‌డీఏ గత అంచనాలకంటే తక్కువ స్థానాల్లో విజయం సాధించవచ్చని ప్రస్తుతం భావిస్తున్నామని, తక్కువ మెజారిటీతో అధికారంలోకి వస్తే విధాన సంస్కరణలు తీసుకొచ్చే సామర్థ్యం ప్రభుత్వానికి ఉండదని ఫిలిప్ క్యాపిటల్ ఇండియా విశ్లేషకులు అంజలి వర్మ, నవనీత్ విజయన్‌లు ఒక తాజా నోట్‌లో తెలిపారు.

‘క్యూ4 కార్పొరేట్ ఫలితాలు, లోక్‌సభ ఎన్నికల అనిశ్చితితో ముందుజాగ్రత్తగా ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి పక్కకు జరుగుతున్నారు. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల స్థాయిని కోల్పోయినందున, స్వల్పకాలికంగా ఇదే ట్రెండ్ కొనసాగు తుందని అంచనా వేస్తున్నాం’

 నాయర్

రీసెర్చ్ హెడ్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్

‘ఎన్నికల టెన్షన్‌తో సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు జరపడం, ట్రేడర్ల స్కేరింగ్‌అప్ లావాదేవీల కారణంగా మార్కెట్ పతనమయ్యింది’

 జసాని

రీసెర్చ్ హెడ్, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్

‘ప్రస్తుత మార్కెట్ కరెక్షన్‌కు అంతర్జాతీయ కారణమేదీ లేదు. ఎన్నికల ఫలితాల పట్ల అసందిగ్ధతతో మార్కెట్లో లాభాల స్వీకరణ జరుగుతున్నది. గత కొద్ది నెలలుగా దేశీయ సంస్థలు, హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మార్కెట్‌ను పరుగులు పెట్టించాయి. వారిప్పుడు కొంతమేర లాభాల్ని తీసుకుని, సైడ్‌లైన్స్‌లో వేచిచూస్తున్నారు’

 మీనా

రీసెర్చ్ హెడ్, స్వస్తికా ఇన్వెస్ట్‌మెంట్