అశ్వాపురంలో బీఆర్ఎస్ మండల కార్యాలయాన్ని ప్రారంభించిన రేగా కాంతారావు
అశ్వాపురం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నూతన మండల కార్యాలయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో రేగా కాంతారావు మాట్లాడుతూ... పార్టీ కార్యకర్తలే బీఆర్ఎస్‌కు బలమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






