రీయింబర్స్‌మెంట్‌ను అమలుచేయాలి
బకాయిలు రూ.8 వేల కోట్లు విడుదల చేయాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
విద్యార్థులతో కలిసి నల్లకుంటలో భారీ ర్యాలీ
ముషీరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా అమలుచేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఫీజుల బకాయిలు రూ.8 వేల కోట్లు వెంటనే విడుదలచేయాలని పేర్కొన్నారు. ఫీజు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ నిఖిల్ పటేల్ అధ్వర్యంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ నుంచి శంకర్‌మఠం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ.. ఇంజినీరింగ్, ఫార్మసీ, పీజీ, డిగ్రీ తదితర కోర్సులు పూర్తయిన వారికి కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఏ కాలేజీకి వెళ్లినా విద్యార్థులు ఫీజులు కట్టలేక నరకయాతన అనుభవిస్తుంటే ప్రభుత్వానికి సంతోషంగా ఉందా అని ప్రశ్నించారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని 18 ఏండ్లుగా కొనసాగుతున్న విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఇటీవల ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 9తో స్పష్టత లేకపోవడం వల్ల తీవ్ర గందరగోళం ఏర్పడుతున్నదన్నారు.
నిఖిల్ పటేల్ మాట్లాడుతూ న్యాయమైన ఈ సమస్యపై ప్రభుత్వం తాత్సారం చేస్తే భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. వారం రోజుల్లో ఐదు లక్షల మంది విద్యార్ధులతో హైదరాబాద్‌ను నిర్బంధం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీశ్‌కుమార్, రాష్ట్ర కన్వీనర్ పల్లగొల్ల రాందేవ్ మోదీ, చిక్కుడు బాలయ్య, గుజ్జ కృష్ణ యాదవ్‌తోపాటు వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.






