4 July, 2026 | 12:43 AM

గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ హబ్ లక్ష్యం

04-07-2026 12:00 AM

కేంద్రానికి తెలంగాణ కీలక ప్రతిపాదనలు

మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని కోరిన మంత్రి శ్రీధర్‌బాబు

సానుకూలంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్

త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ 

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ముందంజ

రాష్ట్రాన్ని అభినందించిన కేంద్రమంత్రి

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): తెలంగాణను దేశంలోనే ప్రముఖ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో పలు కీలక ప్రతిపాదనలు కేంద్రానికి అందించినట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ అయి, తెలంగాణ ప్రతిపాదనలకు సంబంధించిన వినతి పత్రాన్ని అందిచారు.

రాష్ట్ర ఎగుమతి సామ ర్థ్యాన్ని మరింత పెంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పరిశోధన కేంద్రాలు, నాణ్యత పరీక్షా ప్రయోగశా లలు, లాజిస్టిక్స్ మౌలిక వసతులు, ప్రత్యేక పరిపాలనా వ్యవస్థల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరారు. ఈ చర్యలు తెలంగాణ ఎగుమతులను మరింత పోటీతత్వంతో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా, దేశ ఎగుమతుల వృద్ధికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ఎగుమతుల్లో కీలక స్థానంలో ఉన్నదన్నారు.

పసుపు ఉత్పత్తిని ప్రపంచ మార్కెట్‌లో మరింత బలోపేతం చేయడానికి నిజామాబాద్ ప్రాంతానికి అనువైన అధిక కర్కుమిన్ కలిగిన పసుపు విత్తనాల అభివృద్ధి, రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరా, పసుపు ఆరబెట్టడం, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కరీంనగర్‌లో స్పైస్ బోర్డు ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి, పసుపు, మిర్చి, అల్లం వంటి సుగంధ ద్రవ్యాల నాణ్యత పరీక్షలను నిర్వహించే సదుపాయం కల్పించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ఆధునిక ప్యాక్ హౌస్‌తో కూడిన ఇర్రాడియేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా వస్త్ర, ఔషధ, వైద్య పరికరాల రంగాలను బలోపేతం చేసేందుకు వరంగల్ లేదా ఆదిలాబాద్‌లో కాటన్ టెస్టింగ్ ల్యాబ్, అత్యాధునిక వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, మెడికల్ డివైజ్‌ల కోసం కామన్ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించి, తెలంగాణ పరిశ్రమల ఎగుమతులకు మరింత ఊతమిస్తాయని పేర్కొన్నారు. ప్రత్యేక సెజ్‌ల నిర్వహణ కోసం ప్రస్తుతం విశాఖపట్నంలో మాత్రమే ఉన్న డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయానికి బదులుగా హైదరాబాద్‌లో తెలంగాణకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్లు వంటి రంగాల్లో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఎదుగుతోందని, ఎగుమతుల పరంగా కూడా రాష్ట్రం వేగంగా పురోగమిస్తోందని మంత్రి వివరించారు. లాజిస్టిక్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్రంలో అదనపు ఇన్ల్యాండ్ కంటైనర్ డిపోలు, మరో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్క్, లాజిస్టిక్స్ స్కిల్ యూనివర్సిటీ, కంటైనర్ తయారీ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులు అమలైతే రవాణా వ్యయాలు తగ్గడంతో పాటు పరిశ్ర మలకు మరింత సౌలభ్యం కలిగి, ఎగుమతులు వేగవంతమవుతాయని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

ఈ ప్రతిపాద నలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించినట్టు శ్రీధర్‌బాబు తెలిపారు. ముఖ్యంగా ఎరాడిషన్ ఫెసిలిటీ, వివిధ టెస్టింగ్ ల్యాబొరేటరీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. అంతేకాకుండా తెలంగాణను గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను కేంద్రమంత్రి ప్రశంసించారని పేర్కొన్నారు.