రూ.31 కోట్లు రోడ్డుపాలు!
- సూర్యాపేటలో నిరుపయోగంగా సమీకృత మోడల్ మార్కెట్
- ప్రారంభమైన కొన్ని రోజులకే తాళం
- రోడ్డు పక్కనే కూరగాయల విక్రయం
సూర్యాపేట, జూన్25 (విజయక్రాంతి): రూ.31కోట్లు వెచ్చించి, అంతర్జాతీయ టెక్నాలజీతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత మోడల్ మార్కెట్ నిరుపయోగంగా మారింది. మార్కెట్‌లో వ్యాపారాలు సాగడం లేదని వారం రోజుల్లోనే మార్కెట్ నుంచి బయటకు వచ్చి, రోడ్డు పక్కనే అమ్ముతున్నారు.
6 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ భవన నిర్మాణం
కురగాయలు, చేపలు, చికెన్, మటన్ వ్యాపారాలతో పాటు ఇతర వ్యాపారాలు ఒకే చోట కొనసాగించాలనే ఉద్దేశంతో రూ.31 కోట్లతో జిల్లా కేంద్రంలో సమీకృత మార్కెట్‌ను నిర్మించారు. 6 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ భవనం మొత్తం 5 బ్లాకులుగా నిర్మించారు. ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఖాళీ ప్రదేశంలో కురగాయలు అమ్ముకునేలా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి అంతస్థులో ఉన్న గదుల్లో మాంసం, చేపల విక్రయ కేంద్రాలతో షాపింగ్ మాల్స్ కోసం 300షాపులకు గదులను నిర్మించారు.
వారం రోజుల్లోనే బయటకు..
2023 ఆగస్టులో అప్పటి సీఎం కేసీఆర్ సమీకృత మార్కెట్‌ను ప్రారంభించారు. సెప్టెంబర్‌లో కూరగాయల వ్యాపారులకు మార్కెట్‌లో స్థలాలు కేటాయించి అందులోకి తరలించారు. దుకాణాలకు టెండర్ పిలిచి గదులను కేటాయించారు. మున్సిపల్ అధికారులు టెండర్ దారుల నుంచి రూ.10 వేల చొప్పున అడ్వాన్స్ తీసుకొని, నెల రోజుల్లో మూడు నెలల అద్దె ముందుగానే చెల్లించి దుకాణాల్లోకి రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే కూరగాయల వ్యాపారులు అమ్మకాలు సాగడం లేదని వారం రోజుల్లోనే బయటకు వచ్చేశారు.
టెండర్ డబ్బులు వాపస్
సమీకృత మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సుమారు 300 దుకాణాలను టెండర్ ద్వారా వ్యాపారులకు కేటాయించారు. అనేక మంది పోటిపడి మార్కెట్‌లో దుకాణాలు దక్కించుకున్నారు. కానీ కూరగాయల విక్రయదారు లు తిరిగి వెళ్లిపోవడంతో మార్కెట్ బోసి పోయింది. దీంతో మున్సిపల్ అధికారులు మార్కెట్‌కు తాళం వేశారు. నెలలు గడుస్తున్నా తెరచుకోకపోవడంతో కొందరు టెండర్‌దారులు తాము చెల్లించిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వాలని మున్సిపల్ అధికారులను కోరారు. రాజకీయ నేతలు చెప్పిన వారికే అధికారులు డబ్బులు తిరిగి చెల్లించారు. కాగా ఇటీవల బదీలిపై వెళ్లిన కలెక్టర్ ఎస్.వెంకట్రావు తన వీడ్కోలు సమావేశంలో ఏట్లాగైనా మార్కెట్ ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని నూతన కలెక్టర్ తేజస్ నందలాల్‌పవర్‌కు చెప్పారు.






