ప్రజల భద్రత, సంక్షేమం కోసం నిరంతర కృషి: ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్(విజయక్రాంతి): తిర్యాని పోలీస్ స్టేషన్‌లో శనివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ స్మార్ట్ హైదరాబాద్ సహకారంతో గిరిజన ప్రజలకు 87 సోలార్ లైట్ల ను జిల్లా ఎస్పీ నితికా పంత్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
విద్యుత్ సౌకర్యాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సోలార్ లైట్లు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. పోలీస్ శాఖ ప్రజల భద్రతతో పాటు సంక్షేమం, సామాజిక అభివృద్ధికి కూడా కృషి చేస్తోందన్నారు.సమాజ సేవలో భాగస్వాములైన రోటరీ క్లబ్ ప్రతినిధులను అభినందించి జ్ఞాపికలు అందించారు. అనంతరం సోలార్ లైట్ల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, రోటరీ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ అనిత రెడ్డి, వెంకటేశ్వరి, సీఐ సంజయ్, ఎస్‌ఐలు సుబ్బారావు, సురేష్, పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.






