13 June, 2026 | 3:53 PM

రాబోయే ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

13-06-2026 03:03 PM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, జూన్ 13 (విజయక్రాంతి) : రాబోయే ఐదు రోజుల పాటు సూర్యాపేట జిల్లాలో వర్షాలు, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శనివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు ఉరుములు వస్తున్నప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని సూచించారు. శిథిలావస్థ ఇళ్లలో ఉండేవారు వీలైతే పక్కా భవనాలలో ఆశ్రయం పొందాలన్నారు. వర్షం పడే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దన్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు.