టీవీలు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లకు రిలయన్స్ ‘జియో ప్లాన్’

30-04-2024 12:10:00 AM

వైజర్ బ్రాండ్‌తో దూసుకొచ్చే ప్రణాళిక

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, హోం అప్లయెన్సెస్ మార్కెట్లో బహుళ జాతి సంస్థల ఆధిపత్యానికి గండికొట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ పావులు కదుపుతున్నది. భారత్‌లోనే తయారు చేసిన టీవీలు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు తదితర ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల మార్కెట్లో దూసు కొచ్చేందుకు రిలయన్స్ ‘జియో ఫోన్’ తర హా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నదని ఎకనామిక్‌టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇటీ వల రిలయన్స్ ప్రారంభించిన వైజర్ బ్రాండ్ ద్వారా కన్జూమర్ డ్యూరబుల్స్ మార్కెట్లోకి దూసుకెళ్లే లక్ష్యంతో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పనిచేస్తున్నదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ‘గతంలో రిలయన్స్ తన సొంత ఉత్పత్తి జియో ఫోన్‌తో  ఫీచర్ ఫోన్ మార్కెట్లో ఎంఎన్‌సీల ఆధిపత్యాన్ని సవాలు చేసింది. ఇదే తరహా విజయాన్ని ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో పునరావృత్తం చేయాలని కోరుకుంటున్నది’ అని ఒక అధికారి తెలిపారు.

ఎయిర్‌కూలర్స్‌తో ప్రారంభం

రిలయన్స్ రిటైల్ ఇప్పటికే వైజర్ ఎయిర్ కూలర్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. టెలివిజన్లు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, ఇతర గృహోపకరణా లు, లెడ్ బల్పులు రానున్న రోజుల్లో మార్కె ట్లో ప్రవేశపెట్టాలని రిలయన్స్ యోచిస్తున్నది. ఈ ఉత్పత్తులను రిలయన్స్ సొంతంగా నే డిజైన్ చేసి, డెవలప్‌చేయాలని భావిస్తున్నది. చౌక ధరల్లో ఉత్పత్తులను కోరుకునే వినియోగదారులను వైజర్ బ్రాండ్ ద్వారా ఆకర్షించాలన్నది ప్రణాళిక. మార్కెట్లో చెలామణీలో ఉన్న ఎల్‌జీ, సామ్‌సంగ్, వర్ల్‌పూల్ బ్రాండ్లతో పోటీపడేరీతిలో వైజర్ ఉత్పత్తులకు రిలయన్స్ ధరల్ని నిర్ణయిస్తుందని ఎక నామిక్ టైమ్స్ పేర్కొంది. గతంలో రిలయ న్స్ రీకనెక్ట్ బ్రాండ్‌ను తీసుకొచ్చిందిగానీ థర్డ్‌పార్టీ డిజైన్, తయారీపై ఆధారపడటం, పరి మిత మార్కెటింగ్ కారణంగా పెద్దగా సక్సెస్ కాలేదు.

ఇప్పటికీ రిలయన్స్ రిటైల్ రీకనెక్ట్ బ్రాండ్‌తో కొన్ని ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నది. బీపీఎల్, కెల్వినేటర్ బ్రాండ్ల లైసెన్సును కొద్ది ఏండ్ల క్రితం తీసుకుని, కొన్ని టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ మోడల్స్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, గణనీయమైన మార్కెట్ వాటాను సాధించలేక పోయింది. ఈ ఉత్పత్తులను డిక్సన్, మిర్క్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ తదితర కంపెనీలు స్థానికంగా డిజైన్ చేసి, తయారు చేసినవికాగా, మరికొన్ని టీసీఎల్, మైడియా ఉత్పత్తి చేసినవాటిని చైనా, ఇండోనేషియాల నుంచి దిగుమతి చేసుకున్నవి. ఈ నేపథ్యంలో                    ‘మార్కెట్లో దూసుకెళ్లేందుకు ఉత్పత్తి డిజైన్ తయారీపై తన పట్టు ఉండాలని రిలయన్స్ యాజమాన్యం భావిస్తున్నది’ అని అధికారి ఒకరు వివరించారు. వైజర్ బ్రాండును ఇన్‌హౌస్‌లో డిజైన్ చేసి, భాగస్వామ్య సంస్థల ద్వారా ప్రస్తుతానికి తయారు చేయించడం, భవిష్యత్తులో సొంతంగా ఉత్పాదక సదుపాయాల్ని నెలకొల్పడం, విస్త్రతమైన డిస్ట్రిబ్యూ షన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడం రిలయన్స్ ప్రణాళికలని ఆ అధికారి వెల్ల డించారు. ఈ క్రమంలో యూఎస్‌కు చెంది న తయారీ కంపెనీ సాన్మినా భారత సబ్సిడరీలో రూ.1,670 కోట్లకు రిలయన్స్ 50.1 శాతం వాటా కొన్నది. సాన్మినాకు చెన్నైలో 100 ఎకరాల క్యాంపస్ ఉన్నది. అక్కడ వైజర్ ఉత్పత్తుల కోసం ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

దేశీయ సంస్థలతో ఒప్పందాలు

రిలయన్స్ తన వైజర్ బ్రాండ్‌నేమ్‌తో టీవీలు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్ల తయారీకి దేశీయ కంపెనీలైన డిక్సన్ టెక్నాలజీస్, మిర్క్ ఎలక్ట్రానిక్స్‌తో ఉత్పత్తి ఒప్పందాలను ఖరారు చేసుకుంటున్నట్టు సమాచారం. మార్కెట్లో వైజర్ బ్రాండ్ వేళ్లూనుకున్న తర్వాత సొంత తయారీ సదుపాయాలను నెలకొల్పాలన్నది రిలయన్స్ దీర్ఘకాలిక ప్రణాళికగా చెపుతున్నారు.