26 February, 2026 | 3:47 AM

బుజ్జగింపు రాజకీయాలతోనే మత ఘర్షణలు

26-02-2026 01:58 AM
  1. అధికార పార్టీ ఒత్తిడిలో పోలీసుల ఏకపక్ష దాడులు  
  2. బాన్సువాడ, కామారెడ్డి, రుద్రూర్ ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి
  3. డీజీపీకి బీజేపీ అగ్రనేతల ఫిర్యాదు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): రాష్ర్టంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న బుజ్జగింపు రాజకీయాల వల్లే రాష్ర్టంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయని భారతీయ జనతా పార్టీ  తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాన్సువాడ, కామారెడ్డి, రుద్రూర్ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన వరుస హింసాత్మక ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతున్నాయని మండిపడింది.

దాడులు ఎదుర్కొన్న వారిపైనే కేసులు పెడుతూ పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి తొత్తుగా మారిందని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతత్వంలోని ఉన్నతస్థాయి బృందం బుధవారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది. పక్షపాత ధోరణి వీడి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బీజేపీ కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

డీజీపీని కలిసిన వారిలో రాంచందర్ రావుతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ గౌతం రావు, వేముల అశోక్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ తదితరులు ఉన్నారు.  అనంతరం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, పోలీసుల వ్యవహారశైలిపై  విరుచుకుపడ్డారు.

సీఎం చేతిలోనే హోం శాఖ ఉన్నప్పటికీ చట్ట వ్యతిరేక శక్తులు రెచ్చిపోతుండటం సీఎం వైఫల్యమేనని స్పష్టం చేశారు. బాన్సువాడలో భక్తి గీతాలు వింటున్న ఒక హిందూ యువతిని అడ్డుకుని, ఆమెపై దాడికి యత్నించి ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించారని రాంచందర్ రావు ఆరోపించారు. 

కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై వందలాది మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గుంపుగా వెళ్లి దాడికి యత్నించడం దారుణమన్నారు. ఈ దాడిలో కాంగ్రెస్‌తో పాటు మజ్లిస్ ఎంఐ ఎం పార్టీకి చెందిన వారి సహకారం కూడా ఉందని ఆరోపించారు.  రాష్ర్టంలో వరుసగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను బీజేపీ బృందం డీజీపీ దృష్టికి తీసుకెళ్లింది.