వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండకుంటే చర్యలు తప్పవు
* జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది వర్షాకాలపు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పై నిర్లక్ష్యం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు జిల్లా అధికారి డాక్టర్ కుడిమేత మనోహర్ అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని పిట్టబొంగరం పీహెచ్సి పరిధిలోని గ్రామాల్లో డ్రై డే సందర్భంగా గ్రామాల్లో పర్యటించారు.
అనంతరం కేస్లాపూర్ లోని గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో పర్యటించారు. ఆశ్రమ పాఠశాల ఆవరణను పరిశీలించారు. ఆశ్రమ పాఠశాల ఆవరణలో ని బోరుబావి వద్ద పడేసిన చెత్తను చూసి చెత్తను ఇలా పడేస్తే ఎలా అని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులను ప్రశ్నించారు. ఇలా చెత్త పడేయడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ ఉంటుందని, బోరుబావి వద్ద అపరిశుభ్రత నెలకొందని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులను ప్రశ్నించారు. ఆశ్రమ పాఠశాలలో ప్రతి డ్రైడే రోజు గ్రామపంచాయతీ సిబ్బందిని పిలిపించి ఆశ్రమ పాఠశాలలో శుభ్రత చేయించాలని, చెత్త పడేయకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులకు సూచనలు చేశారు.
ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ప్రతిరోజు చేతులు కడుక్కునే విధానం పై అవగాహన కల్పించడంతోపాటు అంటువ్యాధుల నుండి దూరంగా ఉండే విధంగా విద్యార్థులకు సాయంకాలం వేళలో సూచనలు చేయాలని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఆయనతోపాటు హెచ్ఈ ఓ గోకుల్, హెల్త్ సూపర్వైజర్ జుగునక అచ్యుతరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






