కారుమూరి సునీల్‌కు 14 రోజుల రిమాండ్
- మద్యం కుంభకోణంలో రూ. 28 కోట్ల ముడుపులు
- తండ్రీకొడుకుల ఖాతాల్లో నేరుగా రూ. 15 కోట్లు
- నాంపల్లి ప్రత్యేక కోర్టుకు వివరించిన ఈడీ
- వైకాపా నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు విచారణ నోటీసులు
శేరిలింగంపల్లి, జూన్ 18 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌లోని వైకాపా హయాంలో రూ. 195 కోట్ల మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌ను గురువారం హైదరాబాద్‌లోని అరెస్టు చేసింది. అనంతరం ఆయన్ను నాంపల్లిలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం రవాణా టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని, రవాణా చార్జీలను పెంచేసి ప్రభుత్వ ఖజానాకు రూ. 195.33 కోట్ల నష్టం చేకూర్చారని ఈడీ కోర్టుకు తెలిపింది. అప్పటి ఎండీ వాసుదేవరెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో సునీల్ ఈ కాంట్రాక్టులను సిండికేట్‌కు కట్టబెట్టారని ఈడీ పేర్కొంది. ఈ డీల్ కుదిర్చినందుకు సునీల్‌కు రూ. 28 కోట్ల మేర ముడుపులు అందినట్లు, అందులో రూ. 15 కోట్లు నేరుగా తండ్రీకొడుకుల ఖాతాల్లో చేరినట్లు ఈడీ కోర్టుకు వివరించింది.
ఈడీ కారుమూరి నివాసాలు, కార్యాలయాల్లో జరిపిన సోదా ల్లో భారీగా ఆధారాలు సేకరించింది. రూ. 94.5 లక్షల విలువైన రెండు రోలెక్స్ వాచీలు, లగ్జరీ రేంజ్ రోవర్ కారు, హవాలా లావాదేవీలు, నిధుల మళ్లింపునకు సంబంధించిన పత్రాలు, మొబైల్ చాటింగ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఇప్పటికే కీలక సూత్రధారి రాజ్ కెసిరెడ్డి, మాజీ ఎండీ వాసుదేవరెడ్డిలను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు సునీల్ అరెస్ట్ కాగా, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. ఈ అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.






