పంప్‌హౌజ్ మరమ్మతు పనులు పూర్తి చేయాలి
- అధికారులకు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశం
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 25 (విజయక్రాంతి): చిన్న కాళేశ్వరం పంప్‌హౌజ్ మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్, కాటారం మండలాల్లో ఆయన పర్యటించారు. గోదావరిపై ఉన్న వంతెనను పరిశీలించారు. బీర్‌సాగర్ వద్ద చిన్న కాళేశ్వరం పంప్‌హౌజ్ మరమ్మతు పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ౩ పంప్‌హౌజ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉండ గా రెండు పూర్తయ్యాయని, మరొకటి వచ్చే నెలలో పూర్తిచేయాలని సూచించారు.
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎర్ర చెరువు, మందిరం చెరువు, కొత్త చెరువు పరిధిలోని 10 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించ వచ్చని చెప్పారు. కాటారం మండలం గారెపల్లి వద్ద కాళేశ్వరం రెండో దశ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. గారెపల్లి పంపుహౌజ్ 2 నుంచి 13 చెరువులకు నీటిని అందించే అవకాశాలు న్నాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ యాదగిరి, తిరుపతిరావు, తహసీల్దార్ నాగరాజు, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, ఇరిగేషన్ ఏఈ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.






