2 May, 2026 | 2:57 PM

వ్యవసాయాభివృద్ధిపై దృష్టి పెట్టాలి

26-06-2024 12:29 AM

అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని, వ్యవసాయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళీ శాఖ అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి తుమ్మలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిలిపేసిన వ్యవసాయ పథకాలు ఎన్ని? అందుకు గల కారణాలను అధికారులను కోరారు.

ఖజానాకు అత్యధిక ఆదాయం సమాకూర్చే రంగాలు, వాటిపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చును అధికారుల ద్వారా విచారించారు. ఇక రైతు భరోసాకు సంబంధించి అన్నదాతల అభిప్రాయం ఎలా ఉంది? ఏ విధంగా ముందుకుపోతే మంచిది? అనే విషయాలను రైతుల ద్వారానే తెలుసుకుంటే మంచిదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మ్యాచింగ్ ద్వారా వచ్చే పథకాలు, నిధులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. పంటల బీమాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు, రాబోయే సీజన్‌కు బీమాకు సంబంధించిన టెండర్లపై చర్చించినట్లు తెలిపారు.