తెలంగాణ అడ్వకేట్స్‌కు ప్రాతినిథ్యం ఇవ్వాలి
అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్
అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి నేతృత్వంలో ఏకగ్రీవ తీర్మానం
సామాజిక న్యాయం, సముచిత ప్రాతినిథ్యంపై సీనియర్ న్యాయవాదుల గళం
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణకు చెందిన అర్హులైన న్యాయవాదులకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం ప్రతిబింబించేలా న్యాయవ్యవ స్థ ఉండాలని స్పష్టం చేసింది.
తెలంగాణ హై కోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. సురేందర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం తెలంగాణ హైకోర్టులో జరిగిన అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. సమావేశంలో ఉ పాధ్యక్షుడు డీ.ఎల్. పాండు, కార్యదర్శులు పీ. శ్రవణ్ కుమార్ గౌడ్, కే. నిరంజన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి పీ. కృష్ణ కీర్తన, ఖజాంచి బి. బాలాజీ, క్రీడా, సాంస్కృతిక కార్యదర్శి జె. విష్ణువర్ధన్‌తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
హైకోర్టు బెంచ్‌కు ఎంపిక చేసే న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయాన్ని పాటించడంతో పాటు అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని సమావేశం అభిప్రాయపడింది. తెలంగాణలో ప్రతిభావంతులు, అనుభవజ్ఞులు, నిబద్ధత కలిగిన న్యాయవాదులు ఎంతోమంది ఉన్నారని, వారికి తగిన గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందని సీనియర్ న్యాయవాదు లు వెల్లడించారు. న్యాయమూర్తుల ఎంపికలో కేవలం ప్రతిభ మాత్రమే కాకుండా ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రజల భావోద్వేగాలు, సమగ్ర ప్రాతినిధ్యం కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు సూచించారు.
ఈ అంశంపై భారత ప్రధానన్యాయమూర్తి, సుప్రీంకోర్టు కొలీజియం సభ్యులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, తెలంగాణ గవర్నర్, ముఖ్యమంత్రి, వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు వినతిపత్రాలు సమర్పించాలని అసో సియేషన్ నిర్ణయించింది. న్యా యమూర్తుల నియామకాల్లో పారదర్శకత, న్యాయం, తెలంగాణకు ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల17న హైకోర్టు వద్ద నిరసన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ‘ప్రజలవైవిధ్యం, ఆకాంక్షలు, సామాజిక వాస్తవాలు న్యాయవ్యవస్థలో ప్రతిబింబించాలి. రాష్ట్ర హైకోర్టు బెంచ్‌లో సముచిత ప్రాతిని ధ్యం దక్కాల్సిందే’ అని అసోసియేషన్ తన తీర్మానంలో స్పష్టం చేసింది.






