23వ వార్డు కౌన్సిలర్ అందుబాటులో లేరంటూ కమిషనర్‌కు వినతి
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి సరిత ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు వార్డు ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపిస్తూ వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్ సందీప్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. వినతి పత్రంలో కౌన్సిలర్ అందుబాటులో లేకపోవడంతో వార్డులో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అధికారిక పట్టణ సభల నిర్వహణ వంటి అంశాలు ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే కొందరు వ్యక్తులు తామే వార్డు ఇన్‌చార్జిలమంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమ సిఫార్సుతోనే మంజూరవుతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ సందీప్ మాట్లాడుతూ... మున్సిపాలిటీలో ఇన్‌చార్జి కౌన్సిలర్ వ్యవస్థ లేదని స్పష్టం చేశారు. కౌన్సిలర్ అందుబాటులో లేని పరిస్థితుల్లో మున్సిపల్ సిబ్బందిలో ఒకరిని వార్డు అధికారిగా నియమిస్తామని తెలిపారు. ప్రస్తుతం 23వ వార్డుకు నాగేశ్వరరావును వార్డు అధికారిగా నియమించామని, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళితే పరిష్కరిస్తామని చెప్పారు. వార్డు అధికారితో పరిష్కారం కాని సమస్యలుంటే నేరుగా తనను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
అనంతరం వార్డు ప్రజలు మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. దీనిపై ఆమె స్పందిస్తూ, త్వరలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో సమీక్ష సమావేశం జరగనున్నందున, 23వ వార్డు కౌన్సిలర్ అందుబాటులో లేకపోవడం వల్ల ఏర్పడిన పరిస్థితిని సమావేశంలో ప్రస్తావించి పరిష్కార మార్గం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఉడత ఐలయ్య, రామకృష్ణ, ఆడెపు దామోదర్, జూపాక సుమంత్, కొండ జనార్దన్ రాజు తదితరులు పాల్గొన్నారు.






