విద్యుత్ సమస్యలపై ఏఈకి వినతి
బాలానగర్ ఆగష్టు 5 (విజయక్రాంతి): విద్యుత్ శాఖ అధికారులు సమస్య ఎక్కడుందో తెలుసుకొని పరిష్కరించాల్సింది పోయి ఆ సమస్యలను ఓ కాగితంపై రాసి సంబంధిత ఉన్నత అధికారులకు స్పందిస్తేనే పరిష్కారం లభిస్తుంది అంటే ఎలా అని మండల పరిధిలోని గౌతం గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలానగర్ మండలంలోని గౌతాపూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం గ్రామ సర్పంచ్ తాళ్ల ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్ శాఖ బాలానగర్ ఏఈ చంద్రశేఖర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
గ్రామంలో ఇండ్లపై నుంచి వెళ్లే విద్యుత్ వైర్లను తొలగించి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ స్తంభాలు లేని ప్రాంతాల్లో కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలని, కొత్తగా నిర్మిస్తున్న మహిళా సమైక్య భవనంపై నుంచి వెళ్లే విద్యుత్ లైన్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి గ్రామ ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా కల్పించాలని ఏఈని కోరారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ తాళ్ల ప్రకాష్ గౌడ్, ఉప సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు నరేష్ యాదవ్, ప్రదీప్ పాల్గొన్నారు.






