ఫీల్డ్ అసిస్టెంట్‌ను వెంటనే తొలగించాలని ఎంపీడీవోకు వినతి
చివ్వెంల, ఏప్రిల్ 15 : మండలంలోని బండమీది చందుపట్ల గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్ రవిని తక్షణమే తొలగించాలని పలువురు గ్రామస్తులు అన్నారు. ఇదే విషయమై బుధవారం మండల కేంద్రంలో ఎంపీడీవోకి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2024 సంవత్సరంలో అవినీతి, అక్రమాల ఆరోపణలపై జిల్లా విచారణ అధికారులు రవిని సస్పెండ్ చేసి, ఫీల్ అసిస్టెంట్ పదవి నుంచి తొలగించారన్నారు.
అయినప్పటికీ ఈ సంవత్సరం మళ్లీ అతన్ని విధుల్లోకి తీసుకుంటున్నారని సమాచారం రావడంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా పనిదినాలు చేయకుండా, ఇటీవల వారం రోజులుగా తానే ఫీల్ అసిస్టెంట్ అంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.కావున అతన్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని, లేనిపక్షంలో వందలాది మంది గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భాషీపంగు సునీల్, నల్లగొండ లింగయ్య, వీరబోయిన వెంకన్న, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






