16 July, 2026 | 12:44 AM

తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రతినిధులు

16-07-2026 12:12 AM

నిజామాబాద్, జూలై 15 (విజయ క్రాంతి):  జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ భక్కి వెంకటయ్య గారు సందర్శించారు. ఈ సందర్భంగా TU ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు, TUTA ప్రతినిధులు చైర్మన్ను కలిసి వివిధ కారణాల చేత 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 2014 అధ్యాపకుల పదోన్నతుల ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన చైర్మన్ భక్కి వెంకటయ్య గారు త్వరలో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని వీసీ, రిజిస్ట్రార్లను ఆదేశించారు.

అలాగే ఈ విషయాన్ని ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి శ్రీమతి యోగిత రానా ఐఏఎస్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీమతి దేవసేన ఐఏఎస్ దృష్టికి తీసుకువెళ్తానని అధ్యాపకులకు హామీ ఇచ్చారు. ఆచార్య కనకయ్య తనకు సర్వీస్ పరంగా రావలసిన బెనిఫిట్స్ను త్వరగా ఇప్పించాలని కమిషన్ను కోరారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని వీసీ, రిజిస్ట్రార్లకు సూచించారు.

అనంతరం వివిధ సమస్యలపై విద్యార్థులు, నాన్-టీచింగ్ సభ్యులు చైర్మన్ గారికి వినతి పత్రాలు అందించారు. యూనివర్సిటీని సందర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని వీసీ, రిజిస్ట్రార్లు, తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, విద్యార్థులు, నాన్-టీచింగ్, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. చైర్మన్ వెంట జిల్లా రెవెన్యూ ఆఫీసర్, మండల రెవెన్యూ ఆఫీసర్ తదితరులు ఉన్నారు.