20 August, 2026 | 7:55 PM

జర్నలిస్టుల సొంతింటి కల కోసం టీడబ్ల్యూజేఎఫ్ పాదయాత్ర

20-08-2026 06:19 PM

యూనియన్లకు అతీతంగా మద్దతు ఇవ్వాలని పిలుపు

22న సోయాబ్ హుల్లాఖాన్ జన్మస్థలం నుంచి పాదయాత్ర ప్రారంభం

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేయాలనే డిమాండ్‌తో టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పాలేరు నియోజకవర్గ నాయకులు యాస లక్ష్మారెడ్డి, ఎన్డీ కర్ణకుమార్, పెండ్ర అంజయ్య తెలిపారు. గురువారం తిరుమలాయపాలెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాదయాత్ర వివరాలను వెల్లడించారు. జర్నలిస్టు షోయబుల్లాఖాన్ వర్ధంతి రోజున ఆయన స్వస్థలం సుబ్లేడు గ్రామంలోని విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.

సుబ్లేడు నుంచి తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ఏదులాపురం మున్సిపాలిటీ కేంద్రాల మీదుగా యాత్ర కొనసాగుతుందని చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేసి జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మండల కేంద్రాలను కలుపుతూ సుమారు 15 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. జర్నలిస్టులకు సొంతింటి స్థలాలు కేటాయించి ప్రభుత్వం ఆదుకోవాలని, గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పాదయాత్ర ఏ రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, జర్నలిస్టుల సమస్య పరిష్కారమే లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న పాదయాత్రకు ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టులంతా యూనియన్లకు అతీతంగా పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు నాగరాజు, భూక్య రాజేష్, కామల్ల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.