16 May, 2026 | 2:48 AM

కేఓసీఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలని విన్నపం

16-05-2026 01:41 AM

టేకులపల్లి, మే 15,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఉపరితల గని  కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలని సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ ( ఐఎఫ్ టి యు) రాష్ట్ర అధ్యక్షులు  ఎం డి రాసుద్దిన్ డిమాండ్ చేశారు. కొత్తగూడెం సింగరేణి ఏజిఎం పర్సనల్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర అధ్యక్షులు ఎం డి రాసుద్దీన్ , కొత్తగూడెం  రీజియన్ కార్యదర్శి ఎన్  సంజీవ్ లు మాట్లాడుతూ.. కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో( ఓబి ) విధులు నిర్వహిస్తున్న డ్రైవర్స్, హెల్పర్స్, బ్లాస్టింగ్ తదితర విభాగాల కార్మికులకు ఈపీఎఫ్ గత 12 నెలల నుంచి  జమ కావడం లేదని వాటిని వెంటనే కార్మికుల ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయాలని కోరారు.

కోయగూడెం  ఎల్ ఎస్ ఎన్ కంపెనీ ఓ బి లో సుమారు 300 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని వారి ఖాతాలలో ఈపీఎఫ్ సుమారు 12 నెలల నుండి జమకావటం లేదని అన్నారు. సింగరేణి అధికారులకు అనేకమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ చలనం లేదని అన్నారు. తక్షణమే ఈపీఎఫ్ కార్మికుల ఖాతాలలో జమ అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో (ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర నాయకులు డి ప్రసాద్, ఇల్లందు ఏరియా అధ్యక్షులు రావూరి ఉపేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.