11-11-2025 09:39:51 AM
వెల్దండ: మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామ శివారులో తన భర్త కొనుగోలు చేసిన భూమిని తనకు ఇప్పించాలని రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం విట్టాయిపల్లి గ్రామానికి చెందిన హైమావతి సోమవారం కొట్ర తండా వద్ద గల జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామ రెవెన్యూ శివారులో 237, 238 సర్వే నెంబర్ లో 2006 సంవత్సరంలో తన భర్త వీరేశం 10.06 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. 2020 సంవత్సరం వరకు సాగు చేయడం జరిగిందని బాధితురాలు హైమావతి ఫిర్యాదులు పేర్కొన్నారు. తన భర్త వీరేశం శబరిమలైకి వెళ్లి అక్కడే స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. అప్పటినుండి పొలం సాగు చేయకపోవడంతో ఇతరులు కబ్జా చేశారు. అధికారుల, కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. తన భూమిని తనకు ఇప్పించాలని స్థానిక గ్రామస్తులతో కలిసి హైమావతి జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అంద చేశారు.