calender_icon.png 11 November, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగ్గ దేవస్థానంలో ప్రధాన అర్చకుని పూజల పట్ల భక్తుల ఆగ్రహం...!

11-11-2025 12:39:50 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మహిళ భక్తురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన అర్చకులు, బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం పూజలు నిర్వహించడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 13 దేవస్థాన అర్చకులు పూజల పేరిట ఒక మహిళా భక్తురాలి ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర దుమారం రేపింది. బాధితురాలు కుటుంబ సభ్యులు అర్చకుని వ్యవహారంపై దేవాదాయ శాఖ అధికారులతో పాటు దేవస్థాన కమిటీ సభ్యులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత నెల 13 నుండి దేవస్థాన ప్రధాన అర్చకులు సెలవులోనే కొనసాగుతున్నారు.

కార్తీక మాసం ప్రత్యేక దినాల్లో దేవస్థానం వద్ద పెద్ద ఎత్తున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన అర్చకులు గర్భగుడిలో పూజలు చేస్తూ కనిపించడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. మహిళా భక్తురాలి పట్ల అసభ్యకర రీతిలో ప్రవర్తించిన ప్రధాన అర్చకుడిని దేవాదాయ శాఖ అధికారులు గర్భగుడిలో పూజలకు ఎలా అనుమతిస్తారని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్చకుని పై శాఖ పరమైన చర్యలు తీసుకొనట్లయితే దేవస్థానం వద్ద దేవాదాయ శాఖ పనితీరుపై నిరసన వ్యక్తం చేసేందుకు మహిళా భక్తులు సిద్ధమవుతున్నారు. ప్రధాన అర్చకుని వ్యవహారంపై దేవాదాయ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు చూడాలి మరి.