09-09-2025 09:13:34 AM
మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓ 99 రోస్టర్ పాయింట్ విధానం వల్ల ఎస్సి గ్రూప్ 3 లోని మాల, దాని అనుబంధ 26 కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జీఓ నెంబర్ 99 ని సవరించి న్యాయం చేయాలని జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గజ్జెల్లి లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు చెన్నూరు ఎమ్మెల్యే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek venkataswamy) పిఏకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, జస్టిస్ షమీం అక్తర్ రిపోర్ట్ ప్రకారం ఎస్సీ మాల దాని అనుబంధ కులాలు ఎస్సీలలో ప్రయోజనం పొందిన కులాలంటూ పేర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాల, దాని అనుబంధ కులాలను ఎస్సీ కేటగిరి 3లో 26 కులాలుగా పొందుపరిచారని, వాస్తవానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జనాభా లెక్కల ప్రకారం శాస్త్రీయంగా ఆధారాలతో వర్గీకరణ జరగాలని, ఇవేమీ లేకుండా ఏకపక్షంగా వర్గీకరణ చేయడం జరిగిందని తెలిపారు.
అశాస్త్రీ యమైన వర్గీకరణ వలన మాలలు తీవ్రంగా నష్టపోయారన్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 99 ద్వారా ఎస్సీ లలో రోస్టర్ విధానం జారీచేశారని దీని ప్రకారం గతంలో రోస్టర్ పాయింట్ 16 ఉన్న మాలలు ప్రస్తుతం 22 పాయింట్ కు మారడం, అది కూడా మహిళా కావడంతో మాలలకు ఇంజనీరింగ్, మెడికల్, పిహెచ్డి ఇతర సీట్లలో తీవ్రంగా అన్యాయం జరుగుతుందని వివరించారు. భవిష్యత్తులో ఈ కుట్రపూరిత జీఓ తో విద్య, ఉద్యోగాలలో మాల, దాని అనుబంధ కులాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వీటిని శాస్త్రీయంగా పరిశీలించి, గ్రూప్ 3 ఎస్సి కేటగిరికి రోస్టర్ 20 లోపు రెండు పాయింట్లు కేటాయించాలని, రోస్టర్ 22 నుండి నుండి 16 కు తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు దాసరి రామన్న, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి పైడిమల్ల నర్సింగ్, జిల్లా కార్యదర్శి గాగుల దుర్గయ్య, పట్టణ అధికార ప్రతినిధి బండ రవి లు పాల్గొన్నారు.