14-08-2025 02:28:06 PM
ఎం జి యూ వీసీ కాజా అల్తాఫ్ హుస్సేన్.
నల్గొండ రూరల్: యూనివర్సిటీ ప్రగతికి, ప్రతిభకు పరిశోధనలే ప్రమాణాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ(Mahatma Gandhi University VC) కాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థిని వాణి గాయత్రి, ఎంబీఏ ద్వితీయ సంవత్సర విద్యార్థిని సనా కౌసర్ లు " ప్రభుత్వ వైద్య సేవలలో సిబ్బంది- వారి పని ప్రదేశాలలో ఎదురయ్యే ప్రమాదాలు" అనే అంశంపై పరిశోధించి స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్ లో గుర్తింపు పొందిన "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్" జర్నల్లో వారి పరిశోధనలు ప్రచురితమైన సందర్భంగా వారిని తన కార్యాలయంలోఅభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి పరిశోధనపై మక్కువ జిజ్ఞాసను కలిగి సామాజిక స్పృహ కలిగిన అంశాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయ ప్రగతి-ప్రతిభకు పరిశోధనలు కొలమానమని, యువ పరిశోధకులుగా ప్రామాణికమైన జర్నల్లో పరిశోధన పత్రం ప్రచురణ ఎంజీయూకు సైతం గొప్ప అంశంగా అభివర్ణించారు.ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. విద్యార్థులకు సహకరించిన అధ్యాపకులు డా సురం శ్వేత, డా రమేష్ లను వీసీ అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, ఆచార్య సరిత, డా సబినా హరాల్డ్, డా సురేష్ రెడ్డి , డా వెంకటరమణారెడ్డి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.