గుమ్మడిదల మున్సిపాలిటీలో రాజీనామా హైడ్రామా
- రాజీనామా పత్రంతో కాంగ్రెస్ కౌన్సిలర్ హాజరు
- మున్సిపల్‌కురాని బీఆర్‌ఎస్ గోవర్ధన్‌రెడ్డి
- మరోసారి సవాలు విసిరితే గుణపాఠం చెబుతాం : కాంగ్రెస్
గుమ్మడిదల, ఏప్రిల్ 27 : గుమ్మడిదల మున్సిపాలిటీలో రాజీనామాల హైడ్రామా కొనసాగింది. ఒకరిపై ఒకరు సవాల్ విసురుకొని రాజీనామాకు ఒకరు సిద్దపడగా మరొకరు వెనకడుగు వేసి హైటెన్షన్ సృష్టించారు. గుమ్మడిదల 13వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ నరేందర్రెడ్డి దమ్ముంటే రాజీనామా చేస్తే తమ కార్యకర్తను నిలబెట్టి గెలిపిస్తానని సీజీఆర్ ట్రస్టు చైర్మన్ చిమ్ముల గోవర్ధన్రెడ్డి మీడియా సమక్షంలో సవాల్ విసిరారు. దీన్ని తీవ్రంగా తీసుకున్న నరేందర్రెడ్డి సోమవారం తన రాజీనామా పత్రంతో వస్తానని, గోవర్ధన్రెడ్డి సతీమణి చేత కూడా రాజీనామా చేయంచి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అనుకున్నట్లుగానే సోమవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య కార్యకర్తలు అందరూ కలిసి గుమ్మడిదల కానుకుంట చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజీనామా పత్రంతో మున్సిపల్ కార్యాలయంలోని కమీషనర్ వద్దకు వెళ్ళారు.
సుమారు 45 నిమిషాల పాటు గోవర్ధన్రెడ్డి కోసం ఎదురు చూశారు. తను రాకపోవడంతో మరొక్కసారి ఎప్పుడైనా సవాలు విసిరే ముందు కాంగ్రెస్ తో పెట్టుకోవద్దని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. చేతగాని సవాలు విసిరి అసమర్థులుగా నిలిచిపోయారని విమర్శించారు. ఈ సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..తమ వార్డు సభ్యులందరికీ కౌన్సిలర్ పదవి లేకున్నా సేవ చేసుకుంటానని హామీ ఇచ్చి రాజీనామాకు సిద్ధపడినప్పటికీ గోవర్ధన్రెడ్డి వెనకకు తగ్గడంతో తాను అసమర్థుడని ప్రజాక్షేత్రంలో తెలిసిపోయిందన్నారు. ఇకపై కల్లబొల్లి మాటలు మానుకోవాలనీ హెచ్చరించారు.
గుమ్మడిదల నుండి కానుకుంట రోడ్డు పనులకు రూ.7.20 కోట్ల నిధులు కేవలం కాటా శ్రీనివాస్ గౌడ్, మంత్రి రాజనర్సింహ సహకారంతో నిధులు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు పుట్ట నర్సింగరావు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సురభి నాగేందర్ గౌడ్ గోకరి జయశంకర్ గౌడ్ మాజీ ఎంపీపీ డి రవీందర్ గౌడ్ వడ్డే కృష్ణ మద్ది వీరారెడ్డి కౌన్సిలర్ బ్యాగరీ వరలక్ష్మి కృష్ణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రారెడ్డి మద్ది ప్రతాపరెడ్డి గోవర్ధన్ గౌడ్ కానుకుంట సర్పంచ్ ఇప్ప పెంటారెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్ది మౌనిక మాజీ సర్పంచ్ బేకు నీలమ్మ మద్దూర్ పటేల్ అశోక్ ముదిరాజ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






