25 July, 2026 | 1:47 AM

రీ సర్వేతో భూసమస్యల పరిష్కారం

25-07-2026 12:29 AM

కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి, జూలై 24: ప్రభుత్వ ఆదేశం ప్రకారం జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మండల తహసిల్దార్ శ్రీనివాస్ తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూముల సర్వే, రీ సర్వే తో భూ సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని, భవిష్యత్తులో భూమి వివాదాలు లేకుండా రికార్డులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలోని భూములకు సంబంధించి హద్దులు నిర్ధారించడం జరుగుతుందని, తద్వారా గ్రామానికి సంబంధించిన భూమి స్పష్టత వస్తుందని, ప్రభుత్వ భూములు సైతం నిర్ధారణ అవుతాయని తెలిపారు.

పట్టా కలిగి ఉండి మోకాపై లేకపోవడం, మోకాపై ఉండి పట్టా కలిగి ఉండకపోవడం అంశాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వం భూములను ఆక్రమించినట్లయితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్వే ప్రక్రియ సమగ్రంగా నిర్వహించి మ్యాపింగ్ చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో భూ సమస్యలు తలెత్తినట్లయితే న్యాయపరమైన చర్యలకు సులభతరమవుతుందని, మ్యాపింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

భూములలో కబ్జాదారుల జాబితా తయారు చేయడం జరుగుతుందని, పట్టా భూముల సర్వే అనంతరం రికార్డులను సరి చూసి సర్వే నెంబర్ల ప్రకారం హద్దుల నిర్ధారణ జరుగుతుందని, పట్టాలో ఒక సర్వే నెంబరు, మోకాలో ఒక సర్వే నెంబరు అంశాలపై మ్యాపింగ్ ప్రకారం పకడ్బందీగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మ్యాపింగ్ తయారు తర్వాత మార్పులు కష్టతరమని, భూములకు సంబంధించి స్పష్టమైన వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.   

మండలంలోని చిన్న వెంకటాపూర్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, రిజిస్టర్లు, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, వర్షాకాలం దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి వహించాలని తెలిపారు.  అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామంలో కొనసాగుతున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత సర్పంచ్, అధికారులకు సూచించారు.