02-12-2025 10:17:20 PM
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
సూర్యాపేట (విజయక్రాంతి): పవన్ వ్యాఖ్యలపై పది రోజులకు మంత్రులు స్పందించడం హాస్యాస్పదమని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పది రోజుల తర్వాత స్పందించిన తీరు ఇద్దరిలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు అనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ మంత్రులు స్పృహలో లేరనీ కొందరు వాటర్ లో నీళ్లు కలుపుకొని స్పృహ కోల్పోతున్నారన్నారు. మరికొందరు కమిషన్లు పంచుకునే పనిలో బిజీగా ఉంటున్నారన్నారు.
ప్రాంతాలుగా విడగొట్టి చూడడం సరైన విధానం కాదన్నారు. ఉద్యమ సమయంలో మేమెప్పుడూ ప్రాంతాలను దూషించలేదన్నారు. అన్నదమ్ములుగా విడిపోయి వేరువేరుగా కలిసి బతుకుదామని కేసీఆర్ అనాడే చెప్పారన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. వాస్తవానికి అభిమానం వేరు రాజకీయాలు వేరన్నారు. మంత్రులు విమర్శలపై కాకుండా పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు పుల్లెంల వెంకట్ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.