జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు స్పందన
పటాన్ చెరు, డిసెంబర్ 24 : జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన కబడ్డీ క్రీడాకారిణి ముక్కెర స్పందన ఎంపికైనట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు బుధవారం వెల్లడించారు. రామచంద్రాపురం మండలం ఈదుల నాగులపల్లి గ్రామానికి చెందిన ముక్కెర పద్మారావు, శకుంతల కుమార్తె ముక్కెర స్పందన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక అయిందన్నారు.
ఈనెల 2 నుండి 4 వరకు నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు సంగారెడ్డి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించిందన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు స్పందన అత్యుత్తమంగా రాణించడంతో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైయిందని తెలిపారు.
ఈ నెల 25 నుండి 28 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టు తరుపున స్పందన పాల్గొననుందని తెలిపారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన స్పందనను సంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు అభినందించారు.






