25-12-2025 12:29:03 AM
నాగర్ కర్నూల్ డిసెంబర్ 24 ( విజయక్రాంతి ): నాగర్ కర్నూల్ జిల్లా డీటీఓ కార్యాలయంపై కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టాలని బిఎస్పీ జిల్లా జోనల్ ఇంచార్జ్ పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీటీసీ కిషన్ నాయక్ ఏసీబీ దాడుల్లో ఒక సాధారణ డీటీసీ వద్ద రూ.300 కోట్లకు పైగా ఆస్తులు ఎలా వచ్చాయన్నది ఆందోళన కలిగించే అంశమన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కార్యాలయంలో ఉన్నతాధికారిగా ఉండి ఆధిపత్యం చెలామణి చేశారన్న ఆరోపణలున్నాయన్నారు. జిల్లా డీటీఓ కార్యాలయంలో అధికారిక ఉత్తర్వులు లేకుండానే ఒక ఏఓ పదేళ్లుగా ఒకే చోట విధులు నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా డీటీసీ, జిల్లా డీటీఓలు సహకరించారని ఆరోపించారు. జిల్లా డీటీఓ కార్యాలయంపై అనేక ఆరోపణలు ఉన్నాయని ఎన్నికల సమయంలో వాడుకున్న వాహనాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేదన్నారు.
డిమాండ్ డ్రాఫ్ట్లను రీసైకిల్ చేశారని, పాత ట్రాక్టర్ ట్రాలీలను కొత్తవిగా రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయని ఈ అంశాలపై నిజాలు వెలుగులోకి రావాలంటే నాగర్ కర్నూల్ జిల్లా డీటీఓ కార్యాలయంపై కూడా ఏసీబీ తనిఖీలు తప్పనిసరిగా చేపట్టాలని డిమాండ్ చేశారు.