27 May, 2026 | 2:58 AM

పదోన్నతితో బాధ్యతలు పెరుగుతాయి

27-05-2026 01:03 AM

మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు

మెదక్, మే 26 (విజయక్రాంతి): ఉద్యోగంలో హోదా పెరిగిన కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే దిశగా అధికారులు కృషి చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. మెదక్ జిల్లా పరిధిలో ఇటీవల ఏఎస్త్స్ర స్థాయి నుంచి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన కృష్ణ, కృష్ణయ్య అనే ఇద్దరు అధికారులు మంగళవారం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

అనంతరం ఎస్పీ చేతుల మీదుగా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై నక్షత్ర చిహ్నాలను అలంకరించారు. ఈ సందర్భంగా అధికారులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పదోన్నతులు కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా ప్రజల పట్ల మరింత బాధ్యతతో పనిచేసే అవకాశమని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను ఓర్పుతో విని, చట్టపరంగా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగేలా ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి కీలక పాత్ర పోషించాలని, విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. నూతనంగా పదోన్నతి పొందిన అధికారులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ ఆకాంక్షించారు.