క్రిమిలేయర్ నిబంధన ఎత్తివేయాలి
- బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
యాదాద్రి భువనగిరి, మే 26 (విజయక్రాంతి): కేంద్ర,- రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రిజర్వేషన్‌లపై ఉన్న క్రిమిలేయర్ నిబంధన ఎత్తి వేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా మోత్కూర్‌లో మంగళవారం జరిగిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ అనంతరం బీసీ ఉద్యోగుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెడతామన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని బలమైన సిఫార్సులున్నాయనీ అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని తెలిపారు.
విద్యా, ఉద్యోగ నియామకాలలో బి.సి రిజర్వేషన్ల పై క్రిమిలేయర్ నిబంధన విధించిన తీరు బిసిలపై వివక్ష, చిన్నచూపు చూస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తుందన్నారు. ఎస్సి, ఎస్టీ, వికలాంగులు, ఎన్సిసి, మహిళ రిజర్వేషన్ వంటి ఆరు రిజర్వేషన్ల వర్గాలకు లేని క్రిమిలేయర్ బి.సి.ల కే ఎందుకు విధించారనీ ప్రశ్నించారు. పాలనలో బిసిలకు భాగస్వామ్యం కల్పించడం ఒకటైతే రిజర్వేషన్ల ద్వారా చదువు, ఉద్యోగం తద్వార అధికారంలో ఈ వర్గాల సామజిక హోదా పెంచడం ఇంకొక భాగమన్నారు.
పార్లమెంట్ లో బిసి బిల్లు పెట్టి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలన్నారు. కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పథకం ప్రకటించాలన్నారు. బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతం పెంచాలని, బిసిలకు పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా ఇవ్వాలని, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియమాకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని కోరారు.
ప్రైవేటు రంగంలో సైతం ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి, ముత్యం వెంకన్న, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రాందేవ్ యాదవ్, యాదగిరి, కళాబృందం రామలింగం, డప్పు స్వామి కలిమల నరసింహ, ఎడ్ల మహాలింగం, నరేష్ ముదిరాజ్, అంజి గౌడ్ పాల్గొన్నారు.






