శ్రీవాణి లో బోనాలు, గోరింటాకు సంబరాలు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి జూనియర్ డిగ్రీ, పిజి కళాశాలలో శనివారం బోనాలు, గోరింటాకు సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సంబరాల్లో విద్యార్థినులు, అధ్యాపకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. విద్యార్థినులు రంగురంగుల దుస్తులు ధరించి, బోనాలను అలంకరించితీసుకువచ్చారు.
సంప్రదాయబద్ధంగా అమ్మవారికి బోనాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భం గా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థినులు జానపద నృత్యాలు, పాటలతో అలరించారు. గోరింటాకు సంబరాల్లో భాగంగా విద్యార్థినులు ఒకరి చేతికి ఒకరు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు.
వివిధ రకాల డిజైన్లతో చేతులను అలంకరించుకుని ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ శశాంక మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం చాలా ముఖ్యమని అన్నారు. ఇటువంటి వేడుకలు విద్యార్థులలో సాంస్కృతిక స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బండారికమలాకర్ ,బాలసాని శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.






