రిటైర్డ్ ఉద్యోగులు సమాజానికి ఆదర్శం
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, నవంబర్ 23 (విజయ క్రాంతి): ప్రభుత్వ సేవలో కీలక పాత్ర పోషించి రిటైర్ అయిన ఉద్యోగులు సమాజానికి అమూల్యమైన అనుభవం, విజ్ఞానం, శిక్షణ కలిగిన వనరులని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా 3.వ మహాసభలు ఘనంగా నిర్వహించరు.
ఈ మహాసభలకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నడిచే ప్రతి శాఖ లోనూ తమ సేవతో ప్రజల జీవితాలను సానుకూలంగా మార్చినవారే పెన్షనర్లు అని అభివర్ణించారు. అదే సందర్భంలో ఆయన ప్రత్యేకంగా పిలుపునిస్తూ అన్నారు: రిటైర్డ్ ఉద్యోగులు సమాజానికి ఆదర్శం. వారు నేరుగా కార్యాలయాల్లో పనిచేయక పోయినా, సేవ మనసు మాత్రం ఎప్పటికీ ఆగకూడదు.
పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, విద్యా సహాయం, సేవా కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలి. వారి అనుభవం, సాయం, మార్గదర్శనం సమాజానికి చాలా అవసరం.అన్నారు. అలాగే సామాజిక సేవ మాత్రమే కాదు, ప్రజల్లో ఏకతా, బాధ్యత, అభివృద్ధి భావనలను పెంపొందించేందుకు రిటైర్డ్ ఉద్యోగులు ముందుండాలి.
యువతకు మార్గదర్శకులుగా నిలిచి, వారి జీవితాల్లో స్ఫూర్తి నింపే కార్యక్రమాలు చేపట్టాలి అని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా సూచించారు. కార్యక్రమంలో పెన్షనర్ల సమస్యలు, ఆరోగ్య భద్రత, పింఛన్ సంబంధిత అంశాలు, ప్రభుత్వానికి సమర్పించాల్సిన అభ్యర్థనలు వంటి విషయాలపై చర్చ జరిగింది. అసోసియేషన్ ప్రతినిధులు తమ అభ్యర్ధనలను ఎమ్మెల్యే గారికి అందజేశారు.
వాటిని సంబంధిత శాఖల వద్ద ప్రాతినిధ్యం వహించి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మహాసభలకు అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లాలోని వివిధ శాఖల రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.






