హైకోర్టు తీర్పుపై రిటైర్డ్ ఉద్యోగుల హర్షం
- కోర్టుకు వెళ్లనివారికి కూడా బకాయిలు చెల్లించాలి: పెన్షనర్లు
- ఏక మొత్తంలో రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పదవీ విరమణ పొందిన ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బెనిఫిట్స్‌ను విడుదల చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించడంతో దీనిపై హైకోర్టు సోమవారం తీర్పునిస్తూ ఏప్రిల్ 9లోగా 2,600 మందికి బెనిఫిట్స్ చెల్లించాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను ఆదేశించింన విషయం తెలిసిందే.
2024 మార్చి నుంచి ఇప్పటి వరకు పదవీ విరమణ పొందిన సుమారు ఇరువై వేల మందికి రూ.10 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. బెనిఫిట్స్ అందకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బుల్లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తమకు వచ్చే బెనిఫిట్స్ అం దుకోకుండానే 70 నుంచి 80 మంది ప్రాణాలొదిలిన సంఘటనలున్నాయి.
ఈక్రమం లో కొంత మంది కోర్టును ఆశ్రయించడంతో వారందరికీ బెనిఫిట్స్‌ను చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలోనే కోర్టుకు వెళ్లిన వారికే కాకుండా రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులందరికీ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సంఘం కోశాధికారి అశోక్ విజ్ఞప్తిచేశారు.
ఆర్థిక స్థోమత ఉన్న వారు, కాస్త తెలిసినవారు న్యాయవాదులను ఆశ్రయిస్తున్నారని, ఆ స్థోమతలేని వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్కొక్కరికి సుమారుగా రూ.30 లక్షల వరకు బెనిఫిట్స్ రావాల్సి ఉందని, వాటిని సకాలంలో ఇస్తే తమ ఆర్థిక సమస్యలు తీరుతాయని తెలిపారు. ప్రభుత్వం కనీసం వారికైనా ఇస్తామని ఒప్పుకున్నందుకు సంతోషమని, మిగతావారికి కూడా చెల్లించాలని విజ్ఞప్తిచేశారు.




