వీధి రౌడీలా రేవంత్ తీరు
- నన్ను అడ్డుకునే ధైర్యం, శక్తి ఆయనకు లేదు
- ఏ ప్రాజెక్టు అడ్డుకున్నానో చెప్పాలి
- అవసరమైతే రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమే
- ప్రజావ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం
- ప్రజలకు జవాబుదారీని.. రేవంత్‌రెడ్డికి కాదు
- కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): సీఎం స్థాయిలో ఉన్న రేవంత్‌రెడ్డి అకారణంగా, అన్యాయంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడు తున్నారని, వీధిరౌడీలాగా వ్యవహరిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘కొన్ని రోజులుగా సీఎం రేవంత్‌రెడ్డి నా మీద అనేక రకాల అబద్ధాలతో అసత్యపు వార్తలతో విమర్శిస్తున్నారని, నన్ను అడ్డుకునే ధైర్యం, శక్తి ఆయనకు లేదు’ అని అన్నారు.
చాలామంది ముఖ్యమంత్రులను చూశానని, వాళ్ల ఇళ్ల ముందే వారిని ఘెరావ్ చేయడం, ఉద్యమాలు చేస్తూ ఢిల్లీ వరకు వచ్చానని గుర్తు చేశారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారెంటీలను అమలుచేయకుండా, ప్రజావ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
10 సంవత్సరాలు నేనే సీఎం అని చెప్పుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, అభద్రత, అహంకారంతో నిరాశ నిస్పృహలతో నామీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీల దయాదాక్షిణ్యాలతో కేంద్రంలో అధికారంలో లేమని, 12 ఏళ్లుగా దేశ ప్రజల ఆశీస్సులతో మోదీ పరిపాలిస్తున్నారని తెలిపారు. అంబర్‌పేట్, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో ఢిల్లీ వరకు వచ్చానని, తెలంగాణ ప్రజలకు జవాబుదారీనని, రేవంత్‌రెడ్డికి కానని స్పష్టం చేశారు.
సీనియ ర్ జర్నలిస్టులతో ఒక కమిటీ ఏర్పాటు చేద్దామని, ఏ ప్రాజెక్టును ఎక్కడ అడ్డుకున్నానో జర్నలిస్టులకు చెప్పాలని, వారు ఏ నివేదిక ఇస్తే దానికి కట్టుబడి ఉంటానని సవాల్ చేశారు. అవసరమైతే రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమేనని సవాల్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నాననే సోయి మరిచిపోయి తెలంగాణ రాజకీయాల్లో ఏరకంగా అవినీతి, అక్రమాలకు, దోపిడీకి పాల్పడుతున్నారో అందరికీ తెలుసు అన్నారు.
వీటికి తెలంగాణ బలైపోతోందని, తెలంగాణలో మంత్రులు ఎవరికి వారు దోచుకుంటున్నారని, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రీ దెబ్బతిన్నదని ఆరోపించారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, అప్పులు పెరిగిపోతున్నాయని, అడ్డగోలుగా ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌లాగా నీచ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు నాకు రావని, ప్యాంటుల్లో తొండలు వదిలే అలవాటు తనకు లేదన్నారు.
తాను మాటకారి కాకపోయినా మాటమీద నిలబడే వ్యక్తిని అని చెప్పారు. అధికారం కోసం పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదన్నారు. మీరు గత రెండున్నర సంవత్సరాలుగా.. ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధంగా ఉన్నారా?, ప్రెస్ క్లబ్‌లో లేదా అమరవీరుల స్తూపం వద్ద చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. ఆఖరి గింజ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కొంటామని చె ప్పారని, మరి ఎక్కడ కొంటున్నారు అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఒక్క కేజీ దొడ్డు బియ్యం వాడకున్నా.. మేం 53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనేందుకు ముందుకొచ్చామన్నారు. అమాయకులైన పేద రైతులను ఇబ్బందులు పెడుతున్నారో రేవంత్ రెడ్డి సమాధానం చెబుతారా? అని నిలదీశారు. మామునూరు విమానా శ్రయం విషయంలో.. భూసేకరణలో కాస్త సమ యం పడుతోందని, అన్ని సమస్యలను అధిగమించి త్వరలోనే ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేపడుతామని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రిగా మోదీ రికార్డు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిపాలనలో అత్యధిక సమయం పరిపాలించిన వ్యక్తిగా చరిత్ర తిరగరాయబోతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. 4,398 రోజులు నెహ్రూ ప్రధానిగా ఉన్నారని, మోదీ 4,399 రోజులు ప్రధానిగా రికార్డు సృష్టించబోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృ ద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. మోదీ నాయకత్వంలో.. తెలంగాణలో బీజేపీ పనిచేస్తుందన్నారు.
మెట్రో ఫేజ్-2 విషయంలో ఎల్ అండ్ టీ విలీనం కోసం కూడా కేంద్ర ప్రభుత్వమే రు ణం ఇప్పించిందని గుర్తు చేశారు. వారిచ్చిన ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసు కుంటారని, కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సూత్రప్రాయంగా దీనికి ఆమోదం తెలిపారని చెప్పారు.






