21 May, 2026 | 11:20 AM

లీకులు తప్ప కేసీఆర్‌ను లాకప్‌లో వేస్తలేరు

21-04-2024 12:20 AM

l ఆయన నుంచి లక్ష కోట్లు ఎప్పుడు కక్కిస్తారు? 

l రేవంత్‌ను ప్రశ్నించిన రఘునందన్ రావు

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ఇందిరాగాంధీ గెలిచిన తర్వాతే మెదక్‌కు పరిశ్రమలు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఆమె మెదక్ ఎంపీగా పోటీ చేయకముందే ఈ ప్రాంతంలో బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఇక్రిశాట్ ఉన్నాయని తెలిపారు. అబద్ధాల పునాదుల మీద రేవంత్‌రెడ్డి మేడలు కడుతున్నారని, సీఎం కుర్చీని అవహేళన చేస్తున్నారని విమర్శించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. పదేళ్లలో కేసీఆర్ అక్రమంగా సంపాదించిన సొమ్మును ప్రజలకు పంచుతానని, ఆయనను లాకప్‌లోకి పంపుతానని పేర్కొన్న సీఎం రేవంత్... లీకులు తప్ప లాకప్‌లోకి పంపడం లేదన్నారు. కేసీఆర్ వద్ద లక్ష కోట్ల కక్కిస్తానన్న ఆయన ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్రంలో లంకె బిందెలున్నాయన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఖాళీ బిందెలున్నాయని అంటున్నారని అన్నారు. తాను మెదక్‌కు ఏం చేశామో చెప్పేందుకు సిద్ధిపేట, మెదక్‌లో చర్చకు సిద్ధమని తెలిపారు.

మెదక్ పార్లమెంట్ పరిధిలో రూ.1600 కోట్ల జాతీయ రహదారులు, గజ్వేల్, సిద్ధిపేట మీదుగా రైల్వేలైన్ తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీదని తెలిపారు. తాను బీసీ బిడ్డనని, బీసీల పక్షపాతినని చెప్పుకునే రేవంత్ రెడ్డి 55 శాతం ఉన్న బీసీల్లో ఎంత మందికి మంత్రి పదవులను ఇచ్చారని ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల్లో తాను ఎందుకు ఓడిపోయానో రాష్ట్ర డీజీపీని అడిగితే తెలుస్తుందన్నారు. మెదక్ జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాలను బీజేపీ బీసీలకు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు అవకాశం కల్పించలేదని ప్రశ్నించారు.