23 August, 2026 | 3:12 AM

విద్యార్థుల భవిష్యత్‌తో రేవంత్ చెలగాటం

23-08-2026 12:00 AM
  1. విదేశీ టూర్లపై ఉన్న శ్రద్ధ సీఎంకు విద్యావ్యవస్థపై లేదు
  2. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
  3. ఫీజుల బకాయి లడాయి పోస్టర్ విడుదల 

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని, విద్యార్థుల భవిష్యత్‌తో సీఎం రేవంత్‌రెడ్డి చెలగాటం ఆడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. పాలకులకు విదేశీ టూర్ల మీద ఉన్న శ్రద్ధ విద్యావ్యవస్థ మీద లేదని విమర్శించారు.

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫీజుల బకాయి-బీజేపీ లడాయి పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖకు కనీసం మంత్రి కూడా లేకపోవడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విమర్శించారు. బీహార్ లాంటి రాష్ట్రంలో విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయిస్తుంటే, తెలంగాణలో కేవలం 7 నుంచి 8 శాతం మాత్రమే కేటాయించడం శోచనీయమన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30,014 స్కూళ్లలో 21,126 బడులు శిథిలావస్థలో ఉండటం, దాదాపు 1,752 పాఠశాలల్లో బాలికలకు కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడం విద్యావ్యవస్థ పతనానికి నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పెట్టుబడుల పేరుతో విదేశీ టూర్లు చేస్తూ రాష్ట్రాన్ని దోచుకునే ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు.

అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు పాత బకాయిలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి, నేడు ఆ మాటను పూర్తిగా విస్మరించారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.15,000 కోట్లు ప్రభుత్వం బకాయి పడటంతో, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపుతున్నాయన్నారు. 

రెండు రోజుల నిరాహార దీక్ష

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ యువమోర్చా, మహిళా మోర్చా గత కొంతకాలంగా నిరంతరం పోరాడుతున్నాయని మహే శ్వర్‌రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడుతూ సోమవారం, మంగళవారం (24, 25 తేదీల్లో) ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట భారీ దీక్షను చేపట్టనున్నట్లు ప్రకటించారు.

పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు రామచందర్‌రావు నేతృత్వంలో జరిగే ఈ దీక్షలో పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని విద్యార్థులకు అండగా నిలబడనున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపుని చ్చారు. ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, లేనిపక్షంలో ఈ ప్రభుత్వ మెడలు వంచైనా సరే విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.