18 April, 2026 | 3:13 PM

రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

15-05-2025 02:12 AM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రుడ్రంగి, మే14(విజయక్రాంతి): భూ భారతి కింద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను  సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. భూ భారతి కింద రెవెన్యూ సదస్సుల్లో భాగంగా రుద్రంగి మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయగా, ఆయా గ్రామాల్లో సదస్సులు కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా రుద్రంగి మండల పరిధిలోని దెగావత్ తండాలో రెవెన్యూ సదస్సులు చేపట్టగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. అనంతరం ప్రజల భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ తెలిపారు. 

ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన లబ్ధిదారులు త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. రుద్రంగి మండలంలోని గైదిగుట్ట తండాలో  కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ గ్రామం పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక కాగా, 44 ఇండ్లు మంజూరయ్యాయి. 23 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నటరాజ్, ఎంపీఓ సుధాకర్, రెవెన్యూ అధికారులు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.