15-05-2025 02:12:39 AM
సంక్షేమాధికారి హైమావతి అంగన్వాడీ కేంద్రాల తనిఖీ
మెదక్, మే 14(విజయ క్రాంతి): మెదక్ జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను అర్హులైన చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లపై ఎంతైనా ఉందని జిల్లా సంక్షేమాధికారిణి (డీడబ్ల్యువో) హైమావతి అన్నారు.
బుధవారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని బోయిగల్లీ, పిట్లంబేస్ అంగన్‌వాడీ కేంద్రాలను సూపర్‌వైజర్ జయంతితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు సామ్, మామ్ ఉన్న పిల్లల బరువులను ప్రత్యేకంగా దగ్గర ఉండి పరిశీలించారు.
ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు మధ్యలో బడి మానేయకుండా డ్రాప్ అవుట్స్ లేకుండా పాఠశాలలు, కళాశాలలల్లో జాయిన్ కావాలని తెలిపా. ఈ విషయంలో అంగన్‌వాడీ టీచర్లు తమవంతు బాధ్యతగా విద్యార్థులు తప్పకుండా చదువుకునేలా చూడాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా అందించే పౌష్టికాహారం తప్పకుండా అందించాలని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వం ద్వారా అందించే ప్రతి పథకాన్ని అర్హులకు చేరేలా చూడాలని, అదే సమయంలో అంగన్‌వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా చూసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ జయంతితో పాటు టీచర్లు తేజమణి, స్మరణ తదితరులు ఉన్నారు.