calender_icon.png 9 December, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తారుమారైన రిజర్వేషన్లు

08-12-2025 01:37:31 AM

-అనుకూలంగా మలచుకుంటున్న అభ్యర్థులు

-సర్పంచ్‌లుగా భార్యాభర్తల పోటీ

-నాడు వారు.. నేడు వీరు.!

మహబూబాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): వచ్చిన అవకాశాన్ని వదులుకునేది లేదు.. ఈసారి వదులుకుంటే మళ్లీ ఐదేళ్లపాటు పక్కన ఉండాల్సిందే.. మా ఇద్దరిలో ఎవరైనా ఒకటే.. చక్రం తిప్పేది మనమే కదా అంటూ.. రిజర్వేషన్లను అనుకూలంగా మలచుకున్నారు కొందరు సర్పంచ్ అభ్యర్థులు.

సర్పంచ్ పదవిని మళ్లీ దక్కించుకోవడమే లక్ష్యంగా తాజా మాజీ సర్పంచులు, రిజర్వేషన్లు అనుకూలించకున్నా సతికి బదులు పతి, పతికి బదులు సతి మళ్లీ ఎన్నికల బరిలో నిలిచి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్యా తండా పంచాయతీ సర్పంచ్ పదవిని గత ఎన్నికల్లో ఎస్టీ మహిళకు కేటాయించగా జాటోత్ హరిచంద్ తన భార్య అరుణను ఎన్నికల బరిలో నిలపగా ఆమె సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అయితే ఈసారి ఆ గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో అరుణకు బదులు ఆమె భర్త హరి చందు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఈసారి సర్పంచ్‌గా మరో వ్యక్తి పోటీకి దిగడంతో అక్కడ ఎన్నిక అనివార్యంగా మారింది.

ఇక ఇదే విధంగా కేసముద్రం మండలం తావూరియా తండా సర్పంచ్‌గా భూక్యా శ్రీనివాస్ నాయక్ గత ఎన్నికల్లో సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఈసారి సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు కేటాయించడంతో తనకు పోటీ చేసే అవకాశం లేకపోవడం వల్ల శ్రీనివాసు తన సతీమణి ఉమను సర్పంచిగా పోటీకి నిలిపారు.

ఇక్కడ కూడా గతంలో మాదిరిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం లేకపోవడంతో ఉమ పోటీలో నిలబడి గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో వీరికి అనుకూలంగా ఉండగా ఈసారి గెలుస్తారా ఓడుతారా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.

ఐదోసారి సర్పంచ్ పదవి కోసం పోటీ.!

మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం దాట్ల గ్రామ సర్పంచ్‌గా కొమ్మినేని రవీందర్, మంజుల దంపతులు గత 20 సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2001, 2006 లో రవీందర్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2013లో మహిళకు కేటాయించడంతో రవీందర్ భార్య మంజుల సర్పంచ్ గా పోటీ చేసి ఎన్నికయ్యారు.

ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో తిరిగి రవీందర్ సర్పంచిగా పోటీ చేసి ఎన్నికయ్యారు.దాదాపు రెండు దశాబ్దాల కాలానికి పైగా రవీందర్ మంజుల దంపతులు ఆ గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహించారు.

తాజాగా గ్రామ సర్పంచ్ పదవి మహిళకు కేటాయించడంతో రవీందర్ భార్య ఇప్పుడు సర్పంచ్‌గా తిరిగి పోటీ చేస్తున్నారు. మంజుల ఎన్నికల్లో విజేతగా నిలిస్తే గ్రామ సర్పంచిగా ఆ దంపతులే ఏకచక్రాధిపత్యం వహించే అవకాశం నెలకొంది.