calender_icon.png 19 January, 2026 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు

19-01-2026 07:15:16 PM

ధర్మారం,(విజయక్రాంతి): ధర్మారం మండలంలోని వివిధ గ్రామాలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం మంత్రి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ధర్మారం మండలంలో పర్యటించి ఎంపిడిఓ కార్యాలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ...  దొంగతుర్తి గ్రామానికి 11 వేల  భక్తులు, బోట్ల వనపర్తి గ్రామానికి 9 వేల మంది భక్తులు, నంది మేడారం కు 6 వేల మంది భక్తులు , ధర్మారం కు 5 వేల మంది భక్తులు, కటికనపల్లి కు 10 వేల మంది భక్తులు, కొత్తూరు కు 6 వేల మంది భక్తులు, ఎర్ర గుట్టపల్లి కు 8 వేల మంది భక్తులు సమ్మక్క సారలమ్మ జాతర కోసం వస్తారని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అంచనాలు తయారు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 

ధర్మారం మండలంలో వివిధ గ్రామాలలో జరిగే సమ్మక్క సారలమ్మ‌ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  ధర్మారం మండలంలో సమ్మక్క సారలమ్మ జాతర జరిగే గ్రామాలకు 4 పంచాయతీ కార్యదర్శులను ఇంచార్జి గా నియమించడం జరిగిందన్నారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు జాతరకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, జాతర సందర్భంగా గ్రామాలలో అక్కడ ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే సంబంధిత మండల పంచాయతీ అధికారి దృష్టికి తీసుకుని రావాలని మంత్రి తెలిపారు.

గ్రామాలలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద గద్దల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎస్.డి.ఎఫ్ నుంచి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, జాతర నిర్వహణ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ధర్మారం మండలంలోని వివిధ గ్రామాలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు అవసరమైన ఏర్పాట్ల కట్టుదిట్టంగా పూర్తి చేయాలన్నారు. అంతకు  ముందు మంత్రి ధర్మారం మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలను జిల్లా కలెక్టర్  కోయ శ్రీహర్ష తో కలిసి సందర్శించారు.