19-01-2026 07:04:57 PM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి: ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగితేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1.5 కోట్ల వడ్డీలేని రుణాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపాలనలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, వారు అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.
మహిళల సంక్షేమం, భద్రత, స్వావలంబనను దృష్టిలో ఉంచుకొని ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యమైన మహాలక్ష్మి పథకంతో పాటు ఇతర పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకాల ద్వారా మహిళల్లో నూతన ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు. మహిళలు తమ సామర్థ్యాన్ని వినియోగించుకొని ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు కీలకం కానున్నారని కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి పట్టణంలో అన్ని స్థానాలు చేతి గుర్తు కైవసం చేసుకునేలా సహకరించాలని పిలుపునిచ్చారు.