8 August, 2026 | 7:30 PM

జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల సమీక్ష

08-08-2026 06:10 PM

జనగామ,(విజయక్రాంతి): జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డా. రవీందర్ నాయక్ గారు శనివారం, జిల్లాను సందర్శించి, సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న మాతా శిశు ఆరోగ్య కార్యక్రమాలు, కుటుంబ నియంత్రణ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, నివారణ చర్యలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలపై జిల్లా అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుత వర్షాకాల పరిస్థితుల నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు, తదితర సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దోమల నివారణ చర్యలు, లార్వా నిర్మూలన, పరిసరాల పరిశుభ్రత, ఫీవర్ సర్వేలు, అనుమానిత కేసుల గుర్తింపు, పరీక్షలు మరియు చికిత్సను వేగవంతంగా చేపట్టాలని, సీజనల్ వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత సమయంలో సాధించాలని, తక్కువ పనితీరు ఉన్న సూచికలపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించేలా క్షేత్రస్థాయి పర్యవేక్షణను మరింత పెంచాలని సూచించారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ ఆరోగ్య పథకాలు మరియు కార్యక్రమాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డా. రవీందర్ నాయక్ సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. వాణిశ్రీ, జిల్లా స్థాయి అధికారులు డా.సిద్ధార్థ రెడ్డి, డా.జి. హరికృష్ణ, డా.శ్రావ్య, వైద్యాధికారులు, సంబంధిత ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.