బడిగంట మోగే వరకు సౌకర్యాలు మెరుగుపరచండి..!
అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ తో ఎమ్మెల్యేల సమీక్ష
గద్వాల: ప్రభుత్వ పాఠశాలల్లో బడిగంట మోగే సమయానికంటే ముందే మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు, బ్లాక్ బోర్డులు, బెంచీలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి లు కలెక్టర్ సంతోష్ ను కోరారు. గురువారం జిల్లా పరిధిలోని పలు అభివృద్ధి, పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రాబోయే వర్షాకాలం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని గ్రామాలలో సరైన రోడ్డు లేకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, మట్టి రోడ్డును వేసేందుకు అనుమతులు ఇవ్వాలన్నారు. గ్రామాల అభివృద్ధి కొరకు నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం ద్వారా మాట్లాడి వెంటనే గ్రామీణ ప్రాంతాలలోని అభివృద్ధి కొరకు నిధులను విడుదల చేసే విధంగా కృషి చేయాలన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో గద్వాల నియోజకవర్గంలో ప్రత్యేక నిధులతో చేపట్టిన వివిధ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గద్వాలలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను త్వరగా పూర్తి అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు.






