బియ్యం సేకరణ ప్రైవేటు సంస్థలకు!
వారి కోసమే గైడ్‌లైన్స్‌లో మార్పులు..
ఒకే రోజు కమిటీ, టెండర్లకు పిలుపు
నాలుగు కంపెనీలే బియ్యం కొనుగోలుచేసేలా విధివిధానాలు
విపక్షాల విమర్శలతో టెండర్ సంస్థలకు బ్రేక్
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ, సన్నబియ్యం కొనుగోళ్ల పాత విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాలకు తెరలేపింది. ప్రతి ఏటా పౌరసరఫరాల శాఖ ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తే అక్కడ నుంచి మిల్లర్లు కొనుగోలు చేసి తరువాత సీఎంఆర్ చేసి భారత ఆహార సంస్ధకు అప్పగిస్తారు. అక్కడ నుంచి పౌరసరఫరాల శాఖ కావాల్సిన బియ్యం తీసుకుంటుంది.
కానీ ఈ సంవత్సరం ఆ పద్ధతి పక్కకు పెట్టి కొంతమంది ప్రభుత్వ పెద్దలు తమ జేబులు నింపుకునేందుకు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారు. అక్కడి నుంచే ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు బీజం పడింది. దీంతో విపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు అక్రమాలు చోటు చేసుకుంటాయని అనధికారిక వర్గాల ద్వారా సమాచారం అందడంతో కూపీ లాగి ప్రజల ముందు పెట్టారు.
గత ప్రభుత్వంలో ఉన్న విధానాలు పాటించకుండా కమీషన్ల కోసం నూతన విధానాలు తీసుకొచ్చారని మీడి యా ముందు వివరాలు బయటపెట్టారు. దీని ద్వారా ప్రభుత్వం ఖజానాకు వందల కోట్ల గండి పడుతుందని విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి విమర్శలకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కౌంటర్‌గా ఎలాంటి టెండర్ల ప్రక్రియ జరగలేదని సమాధానం ఇచ్చారు. మా సర్కార్ సన్నబియ్యం కొనలేదని, అప్పడే కుంభకోణం ఎలా జరిగిందన్నారు. వెయ్యి కోట్ల స్కామ్ ఎట్లా జరింగిదో వారే చెప్పాలన్నారు.
ధాన్యం విక్రయించేందుకు టెండర్లు
రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న ధాన్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల శాఖ జనవరి 25న గైడ్‌లైన్స్ రూపొందించేందుకు ప్లానింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. నూతన విధానాలు రూపొందించి టెండర్లలో పాల్గొనే కంపెనీలకు స్ధానికంగా జీఎస్టితో పాటు, హైదరాబాద్ కార్యాలయం ఉండాలని షరతులు పెట్టారు. దీంతో పలు కంపెనీలో టెండర్లకు హాజరు కాగా అందులో బడా కంపెనీలైన పంజాబ్ , హర్యానా నుంచి వచ్చిన బగాడియా రైస్ ఎక్స్‌పోర్టు, గురునానక్ రైస్ జనరల్ మిల్స్ సంస్థలకు అర్హత లేదని తిరస్కరించారు.
ముందుగా వారు అనుకున్న విధంగా నాలుగు సంస్థలకు టెండర్ల దక్కాయి. తరువాత వీరి కోసం ఏప్రిల్ 18న కొందరు రైస్ మిల్లర్లతో జలసౌధలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆశాఖ కమిషనర్ సమావేశం జరిపారు. కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ సంస్థలకే బియ్యం ఇవ్వాలని రూ.100 స్టాంప్ పేపర్‌పై మిల్లర్లతో బలవంతంగా ఎంవోయు చేయించారు. క్వింటాల్‌కు రూ.2,007 ఉన్న బిడ్ ధరను రూ.2,223 పెంచి అగ్రిమెంట్ కుదిర్చారు. 35 లక్షల టన్నుల రూ.216 చొప్పన రూ.800 కోట్లు అదనంగా వసూలు చేసేందుకు ప్రయత్నాలు చేశారు.
సన్నబియ్యం కొనుగోలు గోల్‌మాల్
విద్యార్థులకు భోజనం పేరుతో 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (10 శాతం నూకలు) క్వింటాల్‌కు రూ.5,700 చొప్పన కొనుగోలు ప్రయత్నాలు చేశారు. బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యం రూ. 40 నుంచి రూ.42 మించిలేదు. అదనంగా రూ.15 చెల్లించి కిలోకు రూ.57తో కొనుగోలుకు తెరలేపారు. గతంలో సన్నబియ్యం కోసం ఏ టెండర్ ఇంత ధర ఇవ్వలేదు. కిలో రూ.35 నుంచి రూ.37కే కొనుగోలు చేశారు. ఏకంగా కిలో రూ.57తో కొనుగోలు చేయడమంటే ఒక క్వింటాల్‌కు రూ. 1500 అదనంగా చెల్లిస్తూ 22లక్షల క్వింటాళ్ల బియ్యం కొనుగోలు చేయాలంటే రూ.350 కోట్లు అవుతుంది. ఇది ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది.






