28 July, 2026 | 9:29 AM

మరో 30 లక్షల టన్నుల వడ్లు కష్టమే

30-05-2024 01:21 AM

ప్రభుత్వ టార్గెట్ 75 లక్షల టన్నులు 

ఇప్పటివరకు 44 లక్షల టన్నులు కొనుగోలు 

ధాన్యం సేకరణకు వారం రోజులే గడువు 

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. వారం రోజులే గడువు ఉండటంతో కావాల్సిన ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పౌరసరఫరాల శాఖ ఆశించిన స్థాయిలో వడ్లు లభించకపోవడంతో అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. రైతులు రెండు నెలల తరువాత ధర ఎక్కువ వస్తుందని, నిల్వలు పెట్టుకోవద్దని, వెంటనే అమ్మకాలు చేస్తే మద్దతు ఇస్తామని చెబుతున్నారు. ప్రారంభంలో కొనుగోళ్లకు సాకులు పెట్టిన అధికారులు ఇప్పుడు కేంద్రాలకు ఎలాంటి ధాన్యం వచ్చినా కొంటున్నారు. 

ఐకేపీ కేంద్రాలు నిర్వహించే మహిళా సంఘాల సభ్యులను వడ్లు ఎక్కువగా కొనుగోలు చేసేలా జాగ్రత్తలు చేపట్టాలని కోరుతున్నారు. టార్గెట్ 75 లక్షల టన్నులుండగా ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం 44 లక్షల టన్నులు మాత్రమే. రెండు నెలల నుంచి 5.50 లక్షల మంది రైతుల వద్ద వడ్లను కొనుగోలు చేశారు. 7,166 కొనుగోలు కేంద్రాల్లో రూ.9,158 కోట్ల విలువైన 44.25 లక్షల టన్నుల కొనుగోళ్లు జరిగాయి. ఇంకా 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి. ఇప్పటికే వానకాలం ప్రారంభకావడంతో కేంద్రాల్లో నిల్వ ఉన్న వడ్లు మరో వారం రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేసేందుకు అధికారులు వేగం పెంచారు. అయినా ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు 50 లక్షల టన్నులకు మించే పరిస్థితి కనిపించడం లేదు. 

ముందస్తు కోతలు 

రైతులు మార్చి చివరి వారంలో వరి కోతలు ప్రారంభించి ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం ఏకేపీ కేంద్రాలకు తరలించారు. 15 రోజుల్లో నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, జనగాం జిల్లాల్లో ముందే కొనుగోళ్లు పూర్తి చేశారు. మిగతా జిల్లాలో కోతలు ఆలస్యమైనా చివరి వారంలో కేంద్రాలకు తీసుకొచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు, తేమ పేరుతో కోతలు పెట్టడం కూడా ఆలస్యానికి కారణమైంది. ఇంతలోనే అకాల వర్షాలు రావడంతో కొనుగోలు ప్రక్రియ నిలిపివేశారు. దీంతో కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి రంగు మారి మొలకెత్తింది. కేంద్రాలకు సకాలంలో వడ్లు తీసుకొచ్చినా అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు జరగలేదని అన్నదాతలు లబోదిబోమన్నారు. 20 రోజుల తరువాత కొనుగోలు చేపట్టినా ఆశించిన స్థాయిలో వడ్లు సేకరించడంలో పౌరసరఫరాల శాఖ విఫలమైంది. 

ప్రైవేటు మిల్లర్లకు అమ్మకాలు 

వడ్లు కొనుగోళ్ల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతో పెద్ద, మధ్యతరగతి రైతులు ప్రైవేటు మిల్లర్లకు ధాన్యం అమ్మేశారు. వ్యాపారులు కల్లాల వద్దకు వచ్చి తూకం వేయడంతో రవాణా ఖర్చు, రోజుల తరబడి కాపాలా ఉండే శ్రమ తప్పింది. డబ్బులు కూడా వెంటనే చెల్లించడంతో వారిని చూసి మిగతా రైతులు కూడా వ్యాపారులకే అమ్మారు. దీంతో ప్రభుత్వానికి సరపడా ధాన్యం లభించడం లేదు. ప్రభుత్వం విధించిన టార్గెట్ చేరుకునేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు.