బియ్యం పంపిణీ షూరూ..
- మూడు నెలల రేషన్ బియ్యంను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న డీలర్లు
- నెలరోజులపాటు పంపిణీ... నిర్లక్ష్యం వహిస్తే డీలర్లపై చర్యలు
ఖమ్మం, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యంను ఒకేసారి పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో ప్రారంభించారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యం ఒకే సారి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. అందుకు గాను ప్రభుత్వం, సివిల్ సప్లై అధికారులు బియ్యంను పంపిణి చేస్తున్నారు.
ప్రతి ఒక్క కుటుంబానికి బియ్యం అందేలా చర్యలు
ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సివిల్ సప్లై అధికారులు ప్రారంభించారు. మూడు నెలల బియ్యం పంపిణీలో రేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే సంబంధిత అధికారులకు సూచించారు. రేషన్ దుకాణాల్లో నెల రోజులపాటు బియ్యం పంపిణీ చేయాలని రేషన్ డీలర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
రేషన్ బియ్యం రేషన్ పంపిణీ సక్రమంగా జరిగే విధంగా సివిల్ సప్లై అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నెలరోజుల పాటు రేషన్ ఇవ్వకపోయినా, చివరి రేషన్ కార్డుదారుల వరకు బియ్యం సరఫరా చేయకపోయినా ఖచ్చితంగా డీలర్లపై, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది.
సర్వర్ సమస్యలను అధిగమిస్తారా..?
రేషన్ బియ్యం పంపిణీ విషయంలో సర్వర్ ప్రాబ్లం ప్రధాన సమస్య మారింది. ఇప్పటివరకు రేషన్ దుకాణాల్లో 15 రోజులపాటు రేషన్ బియ్యం ఇవ్వాలని నిబంధనలు ఉండగా, సర్వర్ సమస్యతో డీలర్లు సుమారు 20 రోజుల నుండి 30 రోజులు వరకు బియ్యం పంపిణీ చేస్తూ వస్తున్నారు. సర్వర్ ప్రాబ్లం వల్ల దుకాణాల వద్దకు వస్తున్న లబ్ధిదారులు గంటల కొద్ది పడిగాపులు కాయాల్సిన పరిస్థితి గతంలో నెలకొంది.
ఈ సమస్యను అధిగమించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై అధికారులు నెలరోజుల పాటు బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మూడు నెలలకు ఒకే ఒకేసారి ఇచ్చే బియ్యాన్ని నెల రోజులపాటు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సివిల్ సప్లై అధికారులకు మరియు డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నెలరోజుల పాటు రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణి చేయాలని, లేనియెడల సంబంధిత డీలర్ల పై చర్యలు తీసుకోబడుతుందని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎలాంటి సర్వర్ ప్రాబ్లం రాకుండా చర్యలు తీసుకుంటామని డీలర్లకు ప్రభుత్వం హామి ఇచ్చినట్లు తెలుస్తోంది.
జిల్లాలో సుమారు 4.70లక్షల మందికి లబ్ధి..
ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం 748 రేషన్ షాపులు ఉన్నాయి. అందులో 4, 69,865 రేషన్ కార్డులు ఉండగా మొత్తం రేషన్ కార్డులకు గాను 13, 28, 400 మంది రేషన్ కార్డులలో లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కొక్క లబ్ధిదారుడికి ఆరు కేజీల చొప్పున ప్రతి నెలకు 84, 90,620 కేజీలు బియ్యం సరఫరా చేస్తుండగా, ప్రస్తుతం మూడు నెలల గాను 2,54,71,860 కేజీల బియ్యం అవసరం కానున్నాయి.
ఈ బియ్యాన్ని ఇప్పటికే జిల్లాలోని అన్ని గోదాములకు సరఫరా చేసినట్లు సివిల్ సప్లై మేనేజర్ శ్రీలత మీడియా కు తెలిపారు. ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి ప్రతి రేషన్ దుకాణాల్లో మూడు నెలల ఒకేసారి బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు . ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ లబ్ధిదారులకు సరఫరా చేస్తామని తెలిపారు.




