‘రైట్’ పాలిటిక్స్!
‘కాషాయం’లోకి ‘ఎరుపు దండు’ విలీనమా?
మోదీ ప్రభుత్వ ప్రణాళికతో మావోయిస్టు ఉద్యమం నిర్వీర్యం
మరో స్వాతంత్య్ర ఉద్యమ తరహాలో ప్రణాళికలు
గాంధీ, పటేల్ తరహా పాత్ర పోషించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
పార్టీ చీఫ్ సహా ‘లొంగుబాట’లో అగ్రనేతలు
‘కాషాయ’ రాజకీయాల వైపే ఎక్కువ మంది మొగ్గుచూపుతారని అంచనాలు
దేశ రాజకీయాల్లో ఇప్పుడిదే ప్రధాన చర్చ
హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ‘దేశంలో దశాబ్దాలుగా కొనసాగు తున్న మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకుందా?’ అని ఎవరైనా ప్రశ్ని స్తే.. అది వాస్తవమేనని సమాధానం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెలువడుతున్నాయి. ‘2026 మార్చి ౩1’ నాటికి దేశం మావోయిస్టు రహిత దేశం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన గడువు ఈనెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో, ఆయన ప్రకటన సాకారమైందని కేంద్ర ప్రభుత్వంలో అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. లొంగిపోయిన నాయకత్వంలో ఎక్కువమంది ‘కాషాయ’ రాజకీయాల్లో భాగస్వాములవుతాయరనే చర్చ నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం గట్టిగా సంకల్పం తీసుకుని భద్రతా బలగాలతో చేయించిన ఆపరేషన్లు సత్ఫలితాలనిచ్చాయని, దీంతో ‘రెడ్ కారిడార్’గా పేర్గాంచిన ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగా ణ వంటి రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్య మం తుడిచిపెట్టుకుపోయిందని స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు నేపాల్ నుంచి దక్షిణ భారతదేశం వరకు ‘రెడ్ కారిడార్’ విస్తరించి ఉండేది. 1967లో నక్సల్‌బరి ఉద్యమం మొదలు, 2004 నాటికి.. వామపక్ష తీవ్రవాదం మావోయిస్టు ఉద్యమంగా మారింది.
ఈ పోరాటం కారణంగా 2000 మధ్య 15 వేల మందికి పైగా ప్రాణా లు కోల్పోయారు. మృతుల్లో సైనికులు, మావోయిస్టుల నుంచి సాధారణ పౌరులు సైతం ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇకపై అలాంటి చావులు ఉండకూడదని పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేపట్టింది. తత్ఫలితంగా భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. అగ్ర నాయకత్వం లొంగిపోవడం తో పార్టీ మరింత బలహీనపడుతూ వస్తున్నది. ఇప్పుడు.. పార్టీ నిర్వీర్యానికి సమ యం ఆసన్నమైంది. మావోయిస్టు ఉద్య మం వీడిన వారంతా, ఇప్పుడు ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలపై చర్చోపర్చలు జరుగుతున్నాయి. వారు ‘కాషాయ’ రాజకీయాల్లోకి చేరతారా?’ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మోదీ హయాంలో ఉద్యమ క్షీణత..
2014 నుంచి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేయడంతో మావోయిస్టు ప్రభావం గణనీయంగా తగ్గినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమీక్షలు చెబుతున్నాయి. ఒకప్పుడు 126 జిల్లాలకు విస్తరించిన లెఫ్ట్ తీవ్రవాదం ఈ ఫిబ్రవరి నాటికి కేవలం 7- 11 జిల్లాలకు మాత్రమే పరిమితమైందని నివేదికలు పేర్కొంటున్నాయి. హింసాత్మక ఘటనలు సైతం 90 శాతం తగ్గింది. ఈ విజయానికి ప్రధాన కారణం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో చేపట్టిన భద్రతా ఆపరేషన్లు. ఆపరేషన్ కగార్ ద్వారా అబూజ్‌మడ్ అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు లోతుగా చొచ్చుకుపోవడం, సుమారు 4,000 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతం దశాబ్దాలుగా మావోయిస్టులకు కంచుకోటగా ఉం డేది.
భద్రతా బలగాలు ఆ కంచుకోటను బద్దలు కొట్టడంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ దళాలు సక్సెస్ అయ్యాయి. గతేడాది 364 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతిచెందారు. వీరిలో 12 మం ది కీలక నాయకులు ఉన్నారు. అలాగే మొ త్తంగా 2,337 మంది మావోయిస్టులు లొం గిపోయారు. 2019 నుంచి ఇప్పటి వరకు నమోదైన మొత్తం లొంగుబాట్లలో దాదాపు 40 శాతం ఈ ఏడాదిలోనే చోటు చేసుకోవడం గమనార్హం. 2026 ప్రారంభం వరకు మరో 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎన్‌కౌంటర్లలో మరణించారు.
ఆ ఎన్‌కౌంటర్ కీలక మలుపు..
కేంద్ర ప్రభుత్వం అందుకున్న తిరుగులేని విజయాల్లో మావోయిస్టు పార్టీ యుద్ధ వ్యూ హకర్త మాడ్వి హిడ్మా ఎన్‌కౌంటర్ ఒకటి. గతేడాది నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్‌లో హిడ్మా మృతిచెందాడు. అలాగే 40 ఏళ్లుగా అండర్ గ్రౌండ్‌లోనే ఉంటూ, మావోయిస్టు పార్టీ చీఫ్‌గా ఎదిగిన తిప్పిరి తిరుపతితో పాటు పలువురు అగ్రనేతలు ఇటీవల తెలంగాణలో లొంగిపోవడం ఆ పార్టీ వెన్ను విరిగినట్లయింది. ప్రస్తుతం జా ర్ఖండ్ ప్రాంతంలో కొద్దిమంది మావోయిస్టులు మాత్రమే మిగిలారు. వారిలో మిసిర్ బెస్రా ముఖ్యుడు. ఆయనతో పాటు కొద్దిమంది మాత్రమే పార్టీలో ఉన్నారు.
నక్సలిజంపై ఎన్డీయే విజయం..
నక్సలిజం నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కఠిన వ్యూహాలే కారణమని భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. లొంగిపోయే మావోయిస్టు నాయకులకు నగదు బహుమతులివ్వడం, మరీ పెద్ద నేతలైతే కోటి వరకు నగదు అందించడం కూడా కలసివచ్చింది. లొంగిపోయిన వారి పునరావా సంపై దృష్టి సారించడం మరో కారణం. గతేడాది ఫిబ్రవరిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టు ఉద్యమ నిర్మూలన ప్రకటన తర్వాత భద్రతా దళాలు దూకు డుగా ఆపరేషన్లు నిర్వహించాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతాల్లో మావోయిస్టుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్ ఫారెస్ట్ వంటి ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టాయి.
సమాంతరంగా మారుమూల గిరిజన గ్రామాల్లో రహదారులు, పాఠశాలలు, వైద్యాలయాలు నిర్మించడమూ ప్రభు త్వాలకు సత్ఫలితాలనిచ్చాయి. దీంతో మావోయిస్టులకు స్థానికుల నుంచి మద్దతు క్రమంగా తగ్గుతూ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రాజకీయ పరంగా ఈ పరిణామాలు అధికారంలో ఉన్న బీజేపీకి అను కూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే (౨౦౦౪ ప్రాంతంలో) హయాంలో ‘నక్సలిజం దేశంలో అత్యంత పెద్ద అంతర్గత భద్రతా ముప్పు’ అని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఆ తర్వాతే మావోయిస్టు ఉద్యమ విస్తరణ పెరిగిందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.
యూపీయే ప్రభు త్వం ఆ ఉద్యమాన్ని క్షీణింపజేయడంలో విఫలమైందనేది మాత్రం ఇప్పటికీ విశ్లేషకులు చెప్తుంటారు. కానీ, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గతేడాది నుంచి మావోయిస్టు ఉద్యమంపై ప్రత్యేక దృష్టి సారించింది. దేశాన్ని మావోయిస్టు విముక్త దేశంగా మా ర్చేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేసింది. అది ఎంతటి సంకల్పమంటే.. స్వా తంత్య్ర పోరాటంలో మహ్మాతా గాంధీ, స్వా తంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ౫౦౦కి పైగా సంస్థానాలను విలీనం చేయడం లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ పోషించిన పాత్ర కేంద్రంలోని బీజేపీదని రాజకీయ విశ్లేషకులు కొనియాడుతున్నారు.
రాజకీయాల్లోకి మాజీ మావోయిస్టులు?
మావోయిస్టుల లొంగుబాటు తర్వాతి పరిణామాలు రాజకీయాల్లో కొత్త చర్చ తీసుకొచ్చాయి. ఆదివాసీలు, అణగారిన వర్గాల ను సమీకరించే సామర్థ్యం కలిగిన మావోయిస్టు నాయకులు ప్రధాన రాజకీయాల్లోకి ప్రవేశిస్తే, అది ప్రాంతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2025 అక్టోబర్‌లో 60 మంది అనుచరులతో కలిసి లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావుతోపాటు మరి కొందరు ఎన్నికల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లుతెలిసింది.
అయితే.. వారం తా స్వతంత్రంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించడం కష్టతరమనీ, అందుకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అసాధ్యమనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది. దీన్ని ఆసరా చేసుకుని ప్రధాన రాజకీ య పార్టీలు.. మాజీ మావోయిస్టు నేతలను తమ పార్టీలోకి చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో తన ప్రభా వాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించే అవకాశం ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్న బీజేపీ లేదా ఎన్డీయే కూటమితో మాజీ మావోయిస్టులు చేతులు కలపవచ్చనే ప్రచారం ఊపందుకున్నది.
అడవి నుంచి జన జీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత, వారికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలివ్వడం, ఆ పార్టీ అనేక రాష్ట్రాలపై ప్రభావితం చూపడం, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం మాజీ మావోయిస్టులను ఆకర్షించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకు లు చెప్తున్నారు. ముఖ్యంగా మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు బెదిరింపుల ద్వారా ఓటింగ్ ధోరణులను ప్రభావితం చేసిన సందర్భాలు ఉన్నాయి.
మరోవైపు, ప్రభుత్వాలకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడం, వారు మళ్లీ ఉద్యమం లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఆదివాసీల భూసమస్యలకూ పరిష్కారం చూపాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే కేంద్రం ‘లెగసీ థ్రస్ట్ డిస్ట్రిక్ట్స్’ పేరుతో దేశవ్యాప్తంగా 31 జిల్లాలను గుర్తించింది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, అక్కడి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, ఉపాధి అవకాశా లివ్వడంపై కేంద్రం దృష్టి సారించింది. మరోవైపు, మార్చి ౩౧ నాటికి దేశం మావోయిస్టు రహిత దేశంగా మారుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నోసార్లు ప్రకటించారు. ఈ నెల చివరిలోపు ఏం పరిణా మాలు చోటుచేసుకుంటాయనే చర్చ ఒకవైపు అయితే, ఇప్పటికే లొంగిపోయిన మా వోయిస్టుల రాజకీయ భవిష్యత్తు ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
మావోయిస్టు ఉద్యమం క్షీణతకు కారణాలు...
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన సంకల్పంతో వ్యవహరించడం మావోయిస్టు ఉద్యమం తగ్గడానికి ప్రధాన కారణమైంది. భద్రతా చర్యలను నిరంతరం బలోపేతం చేయడం వల్ల ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
* ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఆయుధాలు, పరికరాల వినియోగం కీలక పాత్ర పోషించింది. నైట్ విజన్ కెమెరాలు, ఫోన్ ట్యాపింగ్, డీకాయ్ ఆపరేషన్లు వంటి చర్యలు భద్రతా బలగాలకు పైచేయి సాధించాయి.
* యువత మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులు కాకపోవడం వల్ల కొత్తగా కేడర్ నియామకాలు దాదాపు నిలిచిపోయాయి.
* గెరిల్లా యుద్ధ పద్ధతి నుంచి సాంప్రదాయ యుద్ధ విధానాల వైపు మావోయిస్టులు మళ్లడం కూడా వారి బలహీనతకు దారి తీసింది.
* ఉద్యమం ద్వారా స్పష్టమైన ఫలితాలు కనిపించకపోవడం వల్ల నాయకత్వం, కేడర్‌లో ఆసక్తి తగ్గింది.
* అగ్రశ్రేణి నాయకత్వంలో చాలా మంది వయస్సు పైబడటం, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం కూడా ఉద్యమం క్షీణతకు మరో కారణంగా మారింది.





